Assam-Mizoram Border Row: రాష్ట్రాల మధ్య యుద్ధ మేఘాలు.. అమిత్ షా ఫోన్‌ చేసినా ఆగని ఉద్రిక్తతలు

అసోం-మిజోరం సరిహద్దు పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అడుగు భూమి కూడా వదులుకునేది లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తేల్చిచెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు.

Assam-Mizoram Border Row: రాష్ట్రాల మధ్య యుద్ధ మేఘాలు.. అమిత్ షా ఫోన్‌ చేసినా ఆగని ఉద్రిక్తతలు

Asam (1)

Assam-Mizoram Border Row: అసోం-మిజోరం సరిహద్దు పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అడుగు భూమి కూడా వదులుకునేది లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తేల్చిచెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. ఈశాన్య రాష్ట్రాల మధ్య జరుగుతోన్న రక్తపాతానికి సాక్ష్యంగా నిలుస్తోన్న అసోం-మిజోరంల మధ్య సరిహద్దు గొడవలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.

ఇరు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేసినా.. ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు. రెండు రాష్ట్రాల సీఎంలు వెనక్కి తగ్గకపోగా.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్రం వారించినా వినడంలేదు. పైగా పోటాపోటిగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందారు. మరో 60 మంది పోలీసులు గాయపడ్డారు. ఇది మిజోరం పోలీసుల పనేనని అసోం పోలీసులు చెబుతుండగా.. నిరాయుధులైన పౌరులపై అసోం పోలీసులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాళ్లూ ఎదురు కాల్పులకు దిగారని మిజోరం ప్రభుత్వం వాదిస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య అసోంలోని కచార్‌, మిజోరంలోని కొలాసిబ్‌ జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. 15 రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలున్నాయి. మరోవైపు 200 మందికి పైగా అసోం పోలీసులు CRPF పోస్టును దాటుకుని వచ్చిలైలాపూర్‌ సమీపంలోని పౌరులపై లాఠీలతో విరుచుకుపడ్డారని , దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారని మిజోరం సీఎం జోరామ్‌థాంగ్‌ ట్వీట్‌ చేశారు. ఓ జంట ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్‌ వేదికగా యుద్ధానికి దిగారు.

అటు ఘర్షణల్లో తుపాకులు, నాటు బాంబులు వాడుతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. పోలీసుల మరణాలు కాల్పుల వల్లే జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. దాడికి పాల్పడింది మీరంటే మీరేనంటూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్‌లో మాటల యుద్ధం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదంపై అమిత్ షా.. సీఎంలతో కీలక మీటింగ్ నిర్వహించిన మరుసటి రోజే అసోం-మిజోరంల మధ్య హింస చెలరేగింది.

మరోవైపు అసోం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మిజోరంలోకి ప్రవేశించి, పంటలు, పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెలను కాల్చిబూడిద చేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు భూభాగం అసోం కిందికి వస్తుందని, మిజోరం ఆక్రమణకు పాల్పడిందని అసోం అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అసోం పోలీసులు, ఇతర శాఖ అధికారుల వాహనాలపై మిజోరం రైతులు దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.

మిజోరంతో పాటు మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు అసోంతో సరిహద్దు వివాదాలున్నాయి. అసోం-మిజోరాం మధ్య లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవులు ఉండడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులను కచ్చితంగా గుర్తించలేదు. హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన చట్టం-1971 ప్రకారం లుషాయ్‌ కొండలను అసోం నుంచి విడదీసి..1972లో మిజోరంను కేంద్రాపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.1986లో మిజోరం రాష్ట్ర హోదా పొందింది. సరిహద్దులను నిర్ణయించకపోవడంతో అక్కడి వారు ఇక్కడి భూముల్లో.. ఇక్కడి వారు అక్కడి భూముల్లో వ్యవసాయాలు చేసుకోవడం సాధారణంగా మారింది. బ్రిటిష్‌ పాలకులు విడుదల చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఇప్పుడు ఘర్షణకు దిగుతున్నాయి.

1875లో బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం లుషాయ్‌ కొండలు, కచర్‌ మైదాన ప్రాంతాల సరిహద్దులను నిర్ణయించారు. 1933లో మణిపూర్‌-లుషాయ్‌ కొండల సరిహద్దులను నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాన్ని అసోం అనుకూలంగా మలచుకుంటూ పలు ప్రాంతాలు తమ పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోందని మిజరోం చెబుతోంది. ఇక మాత్రం మ్యాపుల రూపకల్పన సమయంలో అధికారులు తమ అభిప్రాయం తెలుసుకోలేదని మిజోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

1994లోనూ ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2006లోనూ ఈ ఘర్షణలతో 306వ జాతీయ రహదారి 12 రోజులపాటు మూతపడింది. 15 రోజుల క్రితం మళ్లీ ఘర్షణలు మొదలవ్వడం.. ఐఈడీలు పేలడంతో కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల అధికారులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా కచ్చితమైన పరిష్కారం సూచించలేదు. ఇది జరిగిన రెండు రోజులకే కాల్పుల ఘటన సంచలనం రేపింది.