ఫింగర్-8వరకు మనదే..రాహుల్ ఆరోపణలపై రక్షణశాఖ క్లారిటీ

Defence Ministry ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో భార‌త భూభాగం ఫింగ‌ర్ 4 వ‌ర‌కేనంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అస‌త్య‌మ‌ని భార‌త ర‌క్ష‌ణ‌శాఖ శుక్రవారం(ఫిబ్రవరి-12,2021) ప్ర‌క‌టించింది. భార‌త భూభాగం ఫింగ‌ర్ 8 వ‌ర‌కు ఉందని స్ప‌ష్టంచేసింది. భార‌త‌దేశ చిత్ర‌ప‌టం ప్రకారం దేశంలో ఇప్ప‌టికే 43 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భూభాగం 1962 నుంచి అక్ర‌మంగా చైనా ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న‌ద‌ని తెలిపింది. వాస్త‌వాధీన రేఖ కూడా భార‌తదేశ‌పు అవగాహ‌న ప్ర‌కారం ఫింగ‌ర్ 8 మీదుగా ఉందని..ఫింగ‌ర్ 4 మీదుగా కాద‌ని ర‌క్ష‌ణ‌శాఖ స్ప‌ష్టంచేసింది.

ప్రస్తుత చైనా ఒప్పందంతో కూడా కలిపి… ఫింగర్-8వరకు పాట్రోల్ లేదా గస్తీ నిర్వహించేందుకు హక్కుని భారత్ కలిగి ఉందని తెలిపింది. పాంగాంగ్ సరస్సు యొక్క ఉత్తర ఒడ్డున ఇరుదేశాల శాశ్వత పోస్టులు దీర్ఘకాలంగా మరియు బాగా స్థిరపడి ఉన్నాయని రక్షణశాఖ తెలిపింది. విరుద్ధంగా ఏ భూభాగాన్ని అంగీకరించలేదని, LAC పట్ల గౌరవాన్ని అమలు చేశామని, యథాతథ స్థితిలో ఏకపక్ష మార్పును నిరోధించినట్లు తెలిపింది.

కాగా, లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభణకు తెరదించుతూ తాజాగా చైనా-భారత్ మధ్య జరిగిన ఒప్పంద విషయాలపై గురువారం పార్లమెంట్ లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై శుక్రవారం రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రక్షణశాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత బలగాలు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 3 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ (ధన్ సింగ్ తాపా పోస్ట్)దగ్గర ఉంటాయని రాజ్ నాథ్ పార్లమెంట్ లో చెప్పారు.

అయితే ఫింగర్​ 4 మన భూభాగంలోది. ఆ ప్రాంతాన్ని ప్రధాని చైనాకు ఎందుకు ఇచ్చారు? మన సైనికులు వీరోచితంగా పోరాడి కైలాశ్​ పంక్తులను సొంతం చేసుకుంటే.. వారిని ఎందుకు వెనక్కి వచ్చేయమంటున్నారు? ఈ చర్య వల్ల భారత్​కు లాభం ఏంటి? వ్యూహాత్మంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేప్సాంగ్​ ప్రాంతం నుంచి చైనా బలగాలు ఎందుకు వెనక్కి వెళ్లటం లేదు? ప్రధాని భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. వారి ముందు తలవంచారు అని రాహుల్ విమర్శించారు. భారత బలగాలు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 3కి ఎందుకు వస్తున్నాయో ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు