స్పైస్ జెట్ బంపరాఫర్…దేశంలో ఎక్కడినుంచైనా ఢిల్లీకి ఫ్రీ టిక్కెట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : February 4, 2020 / 06:57 PM IST
స్పైస్ జెట్ బంపరాఫర్…దేశంలో ఎక్కడినుంచైనా ఢిల్లీకి ఫ్రీ టిక్కెట్లు

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచితంగా విమాన టికెట్ ఇస్తామంటోంది. స్పైస్ జెట్ కొత్తగా స్పైస్ డెమోక్రసీ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఉచిత టికెట్లను అందిస్తోంది. అయితే కొన్ని కండీషన్స్ అప్లయ్ అంటోంది  

టికెట్ బేస్ ఫేర్‌ను స్సైస్ జెట్ పూర్తిగా రద్దు చేస్తుంది. అయితే కేవలం పన్నులు, ఇతర సర్‌చార్జీలను చెల్లిస్తే సరిపోతుంది. ఉచిత టికెట్ పొందాలని భావించే వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి-31 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 6న ఉచిత టికెట్లకు ఎంపికైన వారి పేర్లను వెల్లడిస్తారు. ఎంపికైన వాళ్లు టికెట్లను బుక్ చేయడానికి బేస్ ఛార్జీలు మాఫీ చేయబడిన లింక్ అందించబడుతుంది. 

ఫిబ్రవరి 8 న ఢిల్లీకి బయలుదేరి,తిరిగి నగరం నుండివస్తే, రెండు టిక్కెట్లపై మొత్తం బేస్ ఛార్జీలను రిఫండ్ చేస్తామని ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రయాణికులు ఫిబ్రవరి 7 న ఢిల్లీకి ప్రయాణించి ఫిబ్రవరి 8 న సిటీ నుంచి తిరిగి రావాలని లేదా ఫిబ్రవరి 8 న ఫ్లై చేసి ఫిబ్రవరి 9 న తిరిగి రావాలని ప్లాన్ చేస్తే, బేస్ ఛార్జీలు మాఫీ చేయడంతో వన్-వే టికెట్ ఇవ్వబడుతుందని స్పైస్ జెట్ తెలిపింది. ఫిబ్రవరి-7 లేదా ఫిబ్రవరి8న ఢిల్లీకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లడానికి ఉచితంగా టికెట్ పొందిన వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చేతి వెలికి ఉన్న సిరా గుర్తుతో ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్స్‌గా పెట్టుకోవాలని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది.

స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ…ఓటింగ్ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద భాగం. దురదృష్టవశాత్తు చాలామంది ఉద్యోగజీవితంలో భాగంగా సొంత ఊళ్లకు దూరంగా ఉంటూ ఓటింగ్ లో పాల్గొనలేకపోతున్నారని తెలిపారు.ఇప్పుడు స్పైస్ జెట్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఢిల్లీ ఓటర్లకు ఓ అవకాశం ఇస్తుంది. భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఢిల్లీలో ఓటు హక్కు ఉన్నవాళ్లను ఉచితంగా వారిని ఢిల్లీకి తీసుకెళ్తుంది. స్పైస్ డెమోక్రసీతో..బలమైన మరియు మరింత శక్తివంతమైన భారత ప్రజాస్వామ్యాన్ని నిర్మించడంలో స్పైస్ జెట్  సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము అని అజయ్ సింగ్ అన్నారు.