Engineering Courses: తెలుగు మీడియంలోనూ ఇంజినీరింగ్‌ విద్య.. ఈఏడాది నుంచే!

Engineering Courses: తెలుగు మీడియంలోనూ ఇంజినీరింగ్‌ విద్య.. ఈఏడాది నుంచే!

Engg

Engineering Courses: వృత్తివిద్యా కోర్సులు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఈ విద్యాసంవత్సరం నుంచే తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాష ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ఇంజనీరింగ్‌ కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తుంది.

దేశవ్యాప్తంగా పదకొండు ప్రాంతీయ భాషల్లోకి ఇంజినీరింగ్ కోర్సులను ట్రాన్స్‌లేట్ చేస్తుండగా.. ఈ నిర్ణయంతో దేశంలో ఇంజినీరింగ్ విద్యలో పాస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భాష కారణంగా ఏ విద్యార్థి కూడా తాను కోరుకొన్న చదువుకు దూరం కాకూడదని, ఇంజనీరింగ్‌ సహా అన్ని ఉన్నతవిద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలని జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఈపీ) ఉండగా.. ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రాంతీయ భాషల్లోకి సబ్జెక్టులను మార్చడం వల్ల కోర్సులను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని, చదువులు ఈజీగా గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుందని, మాతృభాషలో చదవులు నేర్చుకోవడం వల్ల విద్యార్ధులకు మంచే జరుగుతుందని, ఈ ఏడాది మొదట్లో ఏఐసీటీఈ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దాదాపు సగం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు మాతృభాషలో చదవుకునేందుకు ఆసక్తి చూపించారు.

దీంతో ప్రాంతీయభాషలో ఇంజనీరింగ్‌ కోర్సుల బోధనపై ప్రొఫెసర్‌ ప్రేమ్‌ విరాట్‌ అధ్యక్షతన కమిటీ వేయగా.. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకోవడానికి విద్యార్థులకు ఆప్షన్‌ ఉండాలని కమిటీ సూచించింది.

అయితే, తెలుగులో బోధనలు చేసేందుకు ప్రొఫెసర్లు లేరని ఐఐటీలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఇప్పటివరకు 9 రాష్ర్టాల్లో 14 కాలేజీలు ఆసక్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతినిచ్చింది. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం కచ్చితంగా ఉండాలి. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించాలంటే కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు అవసరం ఉంటుంది.