కొత్త ట్రాఫిక్ రూల్స్.. బైక్‌లకు సైడ్ మిర్రర్‌ లేకుంటే ఫైన్ కట్టాల్సిందే..!

కొత్త ట్రాఫిక్ రూల్స్.. బైక్‌లకు సైడ్ మిర్రర్‌ లేకుంటే ఫైన్ కట్టాల్సిందే..!

దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఎంత ఎక్కువగా పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తూ.. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. దేశరాజధాని ఢిల్లీ పోలీసులు అయితే ఒక అడుగు ముందుకు వేసి ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు విషయంలో మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. కారులో వెనుక సీటులో సీటు బెల్టు పెట్టుకోకపోతే, ద్విచక్రవాహనాలకు మిర్రర్‌లు(అద్దాలు) లేకపోతే కఠినంగా వ్యవహరించాలని భారీగా ఛలాన్లు వసూలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో కారు వెనుక సీటులో కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టడం అవసరం.. అంతేకాదు, ద్విచక్ర వాహనంలో, సైడ్ మిర్రర్లు తప్పనిసరి. ఇవి లేకపోతే, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఛలానాలు వసూల్ చేసేస్తారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ అవ్వగా.. ఈ ఆదేశాలు జారీ చేసిన సమయంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. ‘చాలా ద్విచక్ర వాహనాల్లో సైడ్ మిర్రర్లు లేవని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా అద్దాలను తొలగించినట్లు గుర్తించారు. దీనివల్ల డ్రైవింగ్ సమయంలో ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అదే సమయంలో, కారు వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి ఎప్పుడూ బెల్ట్‌ను అటాచ్ చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు.. ముందుగా వారే ఎక్కువగా చనిపోతున్నట్లు అభిప్రాయపడింది.

మోటారు వాహన చట్టం 1988ప్రకారం.. సెంట్రల్ మోటారు వాహన చట్టం 1989 రెండింటిలో ఈ నిబంధన ప్రస్తావించబడిందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన గురించి అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. జరిమానా కూడా వసూలు చేస్తారని, కారులో వెనుక సీటు బెల్టును ఏర్పాటు చేయనందుకు 1000 రూపాయల జరిమానా.. సైడ్ మిర్రర్‌లను ఏర్పాటు చేయకుంటే రూ .500 చలాన కట్టవలసి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది.