NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ
వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

NSA Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అమెరికా సెక్రటరీ ఆంటోని బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు.
గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాతో సాంకేతిక అభివృద్ధి, రక్షణ రంగ టెక్నాలజీ వంటి అంశాలపై దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దీని ద్వారా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో దశకు తీసుకెళ్లాలని అజిత్ ధోవల్ భావిస్తున్నట్లు కొందరు ఉన్నతాధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గత ఏడాది ప్రారంభించిన ఐసీఈటీ (ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్)లో భాగంగా ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయి.
అజిత్ ధోవల్, అమెరికా భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ఈ అంశంపై ఇప్పటికే జనవరి 31న చర్చలు జరిపారు. జెట్ ఇంజిన్ల తయారీ, మ్యునిషన్ టెక్నాలజీలో సహకారం అందించాల్సిందిగా అజిత్ ధోవల్ అమెరికాను కోరారు. రక్షణ రంగం సహకారం విషయంలో ఉన్న అడ్డంకుల్ని, నిబంధనల్ని తొలగించాలని కూడా అజిత్ ధోవల్ కోరినట్లు తెలుస్తోంది. ఐసీఈటీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే రక్షణ పరంగా భారత్.. రష్యాపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే చైనాను ధీటుగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఇండియాకు సహకరించేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆంటని బ్లింకెన్ తెలిపారు.