భారత భాగ్య విధాత : గాంధీ ఓ ఆదర్శం

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 01:44 AM IST
భారత భాగ్య విధాత : గాంధీ ఓ ఆదర్శం

ఓ చిరునవ్వుతో.. ఎదుటి వారి మనసు గెలవొచ్చు. కానీ.. ఆ నవ్వుతో అతను ఏకంగా ఓ దేశాన్నే గెలిచాడు. ఎవరూ ఊహించని విధంగా.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో.. స్వతంత్రం సాధించాడు. 2 వందల ఏళ్లు భారత ప్రజలను పీడించిన బ్రిటీష్ పాలకుల గుండెల్లో.. కేవలం అహింస అనే ఆయుధాన్ని బలంగా దించాడు. అందుకే.. గాంధీ పుట్టి 150 ఏళ్లయినా.. దేశంలో ఎమోషన్ తగ్గలేదు. సుదీర్ఘ.. స్వాతంత్ర్య పోరాటంలో.. అతడే మన మెగా హీరో. మరో.. 150 ఏళ్లు దాటినా.. ఇండియాలో గాంధీ పేరెన్నటికీ తరగదు.. చెరగదు.

భారత స్వాతంత్రోద్యమం.. దేశంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యమాలు జరిగినా.. దీనిని మించింది జరగలేదు. జరగదు కూడా. బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాత దాస్యశృంఖలాలు తెంచేందుకు.. దేశం మొత్తం ఏకమైన ఉద్యమించిన తరుణమది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం.. సరిహద్దులు చెరిపేస్తూ దేశమంతా ఒకే నినాదంపై నిలబడి కొట్లాడిన సమయమది. ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది నాయకులు ముందుండి నడిపించారు. కానీ.. ఎందరు పోరాడినా.. మరెందరు ప్రాణాలర్పించినా.. మన గుండెల్లో ఎన్నటికీ చెరగని ముద్ర పేరే గాంధీ. దేశ ప్రజలను.. బ్రిటీష్ పాలకులు పీడించుకు తింటుంటే.. మిగతా జాతీయోద్యమ నాయకులంతా.. సాయుధ పోరాటం వైపు మొగ్గుచూపారు.

కానీ గాంధీ మాత్రం అహింసావాదాన్నే నమ్ముకున్నారు. ఎవరెన్ని చెప్పినా.. వినలేదు. తను నమ్మిన సిద్ధాంతంపై వెనక్కి తగ్గలేదు. తన అహింసావాదంతో.. అఖండ భారతావనిని.. తన వైపు తిప్పుకున్నాడు. బ్రిటీష్ పాలకులకు.. చలిలో కూడా ముచ్చెమటలు పట్టించాడు. ఆయుధం పట్టకుండానే.. బ్రిటీష్ సామ్రాజ్య పాలనకు చరమగీతం పాడాడు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. అహింస అనే పదం కూడా ఉంటుందని తెలియని వాళ్లకు.. దానినే ఓ ఆయుధంగా మలిచి చూపించాడు. దాన్ని ఎలా వాడాలో.. దగ్గరుండి నేర్పించాడు. తానూ ఆచరించాడు.. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేసి చూపించాడు.

ఉప్పు సత్యాగ్రహం.. గాంధీ ఉద్యమ సిద్ధాంతానికి చక్కటి ఉదాహరణ. గాంధీ సూత్రాలను.. ఒక్క భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయ్. ప్రపంచానికి.. గాంధీ ఓ ఆదర్శం. ఆయన సిద్ధాంతాలు.. ఆచరణీయం.  సిద్ధాంతాల్లేని రాజకీయం, పని కల్పించలేని సంపద, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని శాస్త్రం లాంటివన్నీ.. సామాజిక పాపాలు అన్నాడు మహాత్ముడు. 

మహాత్ముడు పుట్టి.. 150 ఏళ్లవుతున్నా ఇండియన్స్‌లో ఎమోషన్ ఏమాత్రం తగ్గలేదు. ఎన్ని రోజులైనా.. ఇంకెన్ని ఏళ్లు దాటినా.. గాంధీ అనేది బ్రాండ్‌గానే మిగిలి ఉంటుంది. అదీ.. ఆ పేరుకున్న చరిత్ర. సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటంలో.. అతడే మనందరికీ మెగా హీరో. మరో.. 150 ఏళ్లు దాటినా ఈ ప్రపంచంలో గాంధీ పేరెన్నటికీ తరగదు.. చరిత్రలో అసలే చెరగదు.