డ్రైవర్ కు రూ.4 కోట్ల జరిమానా..! లబోదిబోమన్న యువకుడు

  • Published By: nagamani ,Published On : October 30, 2020 / 03:58 PM IST
డ్రైవర్ కు రూ.4 కోట్ల జరిమానా..! లబోదిబోమన్న యువకుడు

Odisha : నెలకు 10వేల రూపాయలు ఉద్యోగం చేసుకుని జీవించే ఓడ్రైవర్ కు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.4 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ యువకుడు పాపం లబోదిబోమంటూ నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నాడు.


వివరాల్లోకి వెళితే..ఒడిశాలోని రూర్కెలాలో రాజేంద్ర పల్లై అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం రాజేంద్రకు కటక్ జీఎస్టీ ఆఫీసు నుంచి అతడికి నోటీసులు వచ్చాయి. నోటీసులో ఉండే వివరాల ప్రకారం..రాజేంద్ర పల్లై ఆర్పీ ఎంటర్ ‌ప్రైజెస్‌ అనే కంపెనీకి యజమానిగా నోటీసులో ఉంది. ఆ కంపెనీ పేరుతో రూ. ఇప్పటి వరకూ 4.31 కోట్ల ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. అది కూడా నకిలీ కంపెనీ పేరుతో, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి పన్ను ఎగవేశావు” కాబట్టి వెంటనే జరిమానా మొత్తం చెల్లించాలని ఆ నోటీసులో ఉంది.


ఆ నోటీసు చూసిన రాజేంద్ర షాక్ అయ్యాడు. ఇదేందిరా దేవుడా నెలకు రూ.10వేలు సంపాదించటానికే నానా పాట్లు పడుతున్నాను. నేను కంపెనీకి యజమానినేంటీ..అంటూ ఆశ్చర్యపోయాడు. తన పేరు, అడ్రస్సు ఎవరో మోసం చేస్తున్నారని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తనకు రూ.10 వేలు జీతం వచ్చే జాబు ఇప్పిస్తానని చెప్పి..తన ఆధార్ కార్డు తీసుకున్నాడనీ..ఆధార్ కార్డు ఆధారంగా నా పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసి ఉంటారని..దీనిపై విచారణ జరపాలని కోరాడు.


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా.. ఆర్పీ ఎంటర్ ‌ప్రైజెస్‌ అనే కంపెనీ ఉనికిలో లేదనీ తెలిపారు. అదే విషయాన్ని జీఎస్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా ఈ విషయాన్ని గుర్తించారు. సదరు కంపెనీ పేరుతో ఎవరు ఈ మోసానికి పాల్పడుతున్నారో విచారిస్తున్నారు.


దీనిపై రాజేంద్ర మాట్లాడుతూ..ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో తన ఆధార్ కార్డు ఇచ్చానని అదే నాకు ఇంతటి ఆందోళనను తెచ్చిపెట్టిందని..తనకు నోటీసులు పంపించిన తరువాత ఈ విషయం జీఎస్టీ అధికారులకు తెలిసిందనీ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాడు.