బాలికపై అత్యాచారం: అలిగి ఇంట్లోంచి పారిపోయి 22రోజులు నరకం చూసింది

  • Published By: vamsi ,Published On : October 15, 2020 / 09:19 PM IST
బాలికపై అత్యాచారం: అలిగి ఇంట్లోంచి పారిపోయి 22రోజులు నరకం చూసింది

ఒడిశాలోని కటక్‌లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. అత్యంత క్రూరంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికపై దారుణానికి పాల్పడ్డారు ఆ నీచులు ఇద్దరు. వివరాలల్లోకి వెళ్తే.. పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి చెప్పినదాని ప్రకారం.. సంతోష్ బెహెరా, రాకేశ్ రౌత్ అనే ఇద్దరు వ్యక్తులు.. తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి పారిపోయిన మైనర్‌ బాలికకు నరకం చూపించారు. ఇంటికి చేరుస్తామని నమ్మించి బాలికను నిర్బందించి 22 రోజుల పాటు లైంగిక దాడి చేశారు. ఒడిశాలో ఈ ఘటన చోటుచేసుకుంది.



జగత్ సింగ్ పూర్ జిల్లా తిర్తాల్‌ గ్రామానికి చెందిన బాలిక గత నెల తన తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి.. కటక్‌కు చేరుకుంది. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు‌ కోసం వేచి చూస్తూ ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి ఇంటి వద్ద దింపేస్తానంటూ నమ్మించి ఆమెను మోటార్ బైక్‌పై ఎక్కించుకుని, తిర్తాల్‌కు తీసుకెళ్లకుండా గతిరౌత్‌పట్నా గ్రామంలోని ఓ కోళ్లఫారానికి తీసుకెళ్లి బంధించాడు. అక్కడ అతను, మరో వ్యక్తి తనపై 22 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది.



22రోజుల పాటు నిర్భంధంలో కామాందుల చెరలో చిక్కుకుని ఇబ్బందులు పడింది బాలిక. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మొబైల్‌లో రికార్డ్ చేసిన నిందితుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బయపడిన బాలిక బయటకు రాలేక కేకలు వేసింది. అయినా కూడా దగ్గరలో ఎవరికీ వినపడే పరిస్థితి లేదు. అయితే అక్కడి కదలికలపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి బాలికను రక్షించారు. ఆమెను తొలుత శిశు సంక్షేమ గృహానికి, అనంతరం అనాథ శరణాలయానికి తరలించారు.



ఈ కేసుకు సంబంధించి 24గంటల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందని. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని అక్కడి ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.