హాట్సాఫ్ : గర్బిణీని 5 కి.మీటర్లు మోసిన ఎమ్మెల్యే

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 11:24 PM IST
హాట్సాఫ్ : గర్బిణీని 5 కి.మీటర్లు మోసిన ఎమ్మెల్యే

ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించిన వారే అసలు ప్రజాప్రతినిధి అని అంటుంటారు. కష్టాల్లో ఉన్నారనే సమాచారం తెలుసుకొన్న వెంటనే అమాంతం వాలిపోయి..వారి సమస్యను తీరుస్తుంటారు కొంతమంది ప్రజాప్రతినిధులు. కష్టాల్లో ఉన్నారని తనకు సమాచారం అందిస్తే..చాలు..ఆదుకుంటానని చెప్పిన ఓ ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారు.

పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణీని ఏకంగా జోలీలో మోసుకెళ్లి..సురక్షితం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేను ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణీ. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆసుపత్రికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు కుటుంబసభ్యులకు. ఎందుకంటే సరియైన రహదారి లేకపోవడం..అంబులెన్స్ రాని పరిస్థితి.

ఈ సమాచారం డాబుగాం BJD ఎమ్మెల్యే మనోహర రాంధారి చెవిన పడింది. వెంటనే ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణీని కూర్చొబెట్టారు. స్వయంగా ఎమ్మెల్యే జోలీని మోశారు. ఇలా 5 కిలోమీటర్ల మేర నడిచారు. అనంతరం కారులో గర్భిణీని ఎమ్మెల్యే తరలించారు. తమ కోసం దిగొచ్చి..జోలీ మోసిన ఎమ్మెల్యేకు గర్భిణీ కుటుంబసభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రజల ప్రతినిధిగా..కష్ట సమయాల్లో వారికి అండగా ఉండాలని అనుకుంటున్నట్లు రాంధారి వెల్లడించారు. 

ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సరియైన రహదారులు లేకపోవడం మూలంగా..అంబులెన్స్‌లు చేరుకోని పరిస్థితి ఉంది. గత నెలలో మావోయిస్టు ప్రభావింత ప్రాంతమైన మల్కన్ గిరి జిల్లాలో అంబులెన్స్ చేరుకోకపోవడంతో వైద్యుడు రాధేశ్యాం స్ట్రెచర్‌పై గర్భిణీని ఏకంగా 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. రాధేశ్యాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పని చేస్తుంటారు.