ఆటోలో తోట..ఎక్కితే ప్రకృతిలో కూర్చున్న ఫీలింగ్

  • Published By: nagamani ,Published On : October 14, 2020 / 01:04 PM IST
ఆటోలో తోట..ఎక్కితే ప్రకృతిలో కూర్చున్న ఫీలింగ్

odisha:సిటీలో ప్రతీచోటా ఆటోలు తిరుగుతుంటాయి. ఆ ఆటోల్లో ఒడిశాకు చెందిన సుజిత్‌ డిగల్‌ అనే ఆటోవాలా ఆటో వెరీ వెరీ డిఫరెంట్. సుజీత్ భయ్యా ఆటో ఎక్కితే దిగాలనే అనిపించదు. ఆటోలో ఉన్నామా? పల్లెటూరిలో పచ్చని ప్రకృతిమాత ఒడిలో ఉన్నామా అనిపిస్తుంది. సుజీత్ ఆటోలో పచ్చని మొక్కలు మనల్ని మనసారా పలకరిస్తాయి. పచ్చగా కళకళలాడుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సుజీత్ తన ఆటోని పచ్చని గార్డెన్ లా మార్చేశాడు.



సీటు పక్కనే మొక్కలు..సీటు పైన వేలాడే మనీ ప్లాంట్..చిట్టి పిట్టల పంజరాలు..అది ఆటోనా లేక పచ్చని తోటా అనిపిస్తుంది. తన ఊరంటే సుజీత్ కు ప్రాణం. కానీ ఉపాధి కోసం పట్టనానికి వలస వచ్చిన అతనికి తన ఆటోనే తన ఊరులా తీర్చిదిద్దుకున్నాడు.



సుజీత్‌ దిగ్గల్‌ సొంత ఊరు.. కాందమాల్‌ జిల్లాలోని ఫూల్‌బని ప్రాంతం. తన ఊరంటే సుజీత్‌కు ప్రాణం. అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తూ హాయిగా ఉండేవాడు. కానీ కరోనా అందరి బతుకుల్ని మార్చేసినట్లే సుజీత్ జీవితాన్ని కూడా మార్చేసింది. ఊరిలో పనిలేకపోవటంతో పొట్ట చేతపట్టుకుని పట్టణం రాక తప్పలేదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకుని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఊరిలో అందరితోను కలిసి మెలిసి తిరిగిన సుజీత్ కు అంత పెద్ద నగరంలో ఒంటరిగా ఫీలయ్యేవాడు. ఆత్మీయులు లేరు..ఆదరంగా మాట్లాడేవారు లేరు. ఎక్కడ చూసినా జనాలు బిజీ బిజీ.


దీంతో సుజీత్ కు ఎప్పుడు తన ఊరి గురించే ఆలోచన. కానీ అక్కడికి వెళ్లలేడు..ఇక్కడ ఉండలేదు. తన ఆటోని ఇంటిగా మార్చుకుని.. పగలూ, రాత్రీ అందులోనే ఉంటున్నాడు. పండుగలు, వేడుకలప్పుడు ఊరికి వెళ్లి కుటుంబాన్ని కలిసి వస్తుండేవాడు. అయినా ఊరి నుంచి దూరంగా ఉంటున్నాననే బాధ సుజీత్‌ను ఎప్పుడూ బాధపెట్టేది.


ఆ బాధను పోగొట్టుకోవడానికి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఊరికి తాను వెళ్లలేకపోతే ఏం.. ఊరినే తన వద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు. అందులో నుంచే ఈ ఆటో గార్డెన్‌ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఆటోలో మొక్కలు పెట్టటానికి అనువుగా మార్చేశాడు. రకరకాల మొక్కల్ని అమర్చాడు. పచ్చగా కళకళలాడుతున్న తన ఆటోని చూసుకుని మురిసిపోతుంటాడు సుజీత్. తన ఊరిలోనే ఉన్నట్లుగా ఆనందంగా ఫీలవుతుంటాడు.


సుజీత్‌ సృష్టించిన ఎన్విరాన్మెంటల్‌ ఫ్రెండ్లీ ఆటో గార్డెన్‌ ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పచ్చటి మొక్కలు.. పిట్టల కిచకిచలు.. కుందేళ్ల కదలికలు.. నీటిలో చేప పిల్లల టపటపలు.. వీటన్నింటితో ఏదో కొత్త లోకంలా ఉంటుంది.. ఈ ఆటో గార్డెన్‌. ఇందులో ఎక్కిన ప్రయాణికులను మైమరపింపజేస్తోంది. ఆటోను ఇలా మార్చడానికి సుజీత్‌ ఎంతగానో కష్టపడ్డాడు. చాలా ఖర్చు కూడా పెట్టాడు. అయినా తన ఊరి దూరంగా ఒంటరిగా ఉన్నాననే బాధ పోగొట్టుకోవాలనే ఆలోచన ముందు.. ఈ కష్టమంతా చాలా తక్కవగా అనిపించింది సుజీత్‌కి.


ఆటోనే గార్డెన్‌గా మార్చాలనే ఆలోచనపై సుజీత్‌ మాట్లాడుతూ..ఇంత పెద్ద నగరంలో తాను ఒంటరిగా ఉండలేకపోయేవాడిని. మాటిమాటికీ ఊరు గుర్తుకొచ్చేది. కానీ ఊరికి వెళ్లలేక.. ఇక్కడ ఒంటరిగా ఉండలేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాడిని. అందుకే ఊరి వాతావరణం తన ఆటోలోనే ఉండేలా ఈ ఏర్పాటు చేసుకున్నాను.




తన ఆటోలో ఎక్కే ప్రయాణికులంతా ఎంతో ఆనందపడుతున్నారని..నీ టేస్ట్ భలేగుంది భయ్యా అని అంటుంటారనీ..అలా తనను భయ్యా అని పిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు సుజీత్. అంతేకాదు తన ఆటో ఎక్కేవారందరికీ సాధ్యమైనంత వరూ మొక్కలు నాటమని..పచ్చదనాన్ని పెంచమని చెబుతుంటానని చెప్పాడు.