తెలుగుకు గౌరవం.. బెంగాల్‌లో అధికార భాషగా గుర్తింపు!

తెలుగుకు గౌరవం.. బెంగాల్‌లో అధికార భాషగా గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేలా తెలుగుకు మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్‌లో ‘తెలుగు’కు అధికార భాషా హోదా కల్పిస్తూ అక్కడి మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్‌లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మినీ ఆంధ్రా’గా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజల కోసం మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలుగు వాళ్లు.. చాలాకాలంగా తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేబినెట్‌ సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయంపై ఆమోదం వేసింది మమత నేతృత్వంలోని మంత్రివర్గం. కేబినెట్‌ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు వెల్లడించారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఉండగా.. ఇప్పుడు తెలుగు గౌరవం దక్కింది.