మేలు చేసిన కరోనా : 3 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుతున్న యూపీ వృధ్ధుడు

  • Published By: murthy ,Published On : May 21, 2020 / 01:49 PM IST
మేలు చేసిన కరోనా : 3 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుతున్న యూపీ వృధ్ధుడు

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజా జీవనం స్తంభించి పోగా.. కొన్ని కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. కరోనా వల్ల కష్టాలే కాదు మేలు కూడా జరిగిందనే విషయం ఇటీవల మైసూర్ లో బయట పడింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి మొదలైన లాక్ డౌన్ వల్ల 3 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి తన కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నాడు. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన కరమ్ సింగ్ (70) అనే వ్యక్తి 3 ఏళ్ల క్రితం తన కొడుకు పెళ్లి చేయటానికి బంధువుల దగ్గర డబ్బులు సమకూర్చుకోవటం కోసం ఇంటి నుంచి బయలు దేరాడు. అయితే ప్రయాణంలో ఉండగా ఒక చోట రైల్వే స్టేషన్ లో రైలు నుంచి కిందకు దిగాడు.  అక్కడ తిరిగి రైలు ఎక్కే సమయంలో తను ప్రయాణిస్తున్న రైలుకు బదులుగా, మరోక రైలు ఎక్కడంతో కష్టాల పాలయ్యాడు. అలా ఎక్కిన రైలులో కరమ్ సింగ్ బెంగుళూరు చేరుకున్నాడు.  

కొత్త ప్రాంతం, భాష తెలియక పోవటంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. బెంగుళూరు రోడ్ల వెంట నడుస్తూ, నడుస్తూ  మైసూర్  చేరుకున్నాడు. దాదాపు 67  ఏళ్ల వయస్సులో  అలా నడుచుకుంటూ బెంగుళూరు నుంచి మైసూరు చేరుకోవటం వల్ల ప్రయాణంలో పడిన ఇబ్బందుల వల్ల అతడు మతి స్ధిమితం కోల్పోయాడు. తను ఎవరు…ఎక్కడి నుంచి వచ్చాడు తదితర వివరాలేం అతనికి గుర్తులేవు. మైసూరు వీధుల్లో ఎవరైనా ఎదైనా ఇస్తే అది తిని… ఫుట్ పాత్ ల మీద పడుకుని కాలం వెళ్లదీస్తున్నాడు.
 
ఇలా ఉండగా కరోనా ఎఫెక్ట్ తో మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రావటంతో  కర్ణాటక ప్రభుత్వం వీధుల్లో ఉండే నిర్వాసితులందరినీ గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించింది. అందులో భాగంగా కరమ్ సింగ్ నంజరాజా బహుదూర్ వృధ్దాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అధికారులు అడిగిన వాటికి సరైన సమాధానాలు ఇవ్వలేక పోవటంతో వారు అతడికి మానసిక వైద్యుడితో చికిత్స చేయించారు. 

కొంత కాలానికే అతడి ఆరోగ్యం మెరుగు పడి జ్ఞాపకశక్తి తిరిగి పొందాడు. దాంతో మైసూరు సిటీ కార్పోరేషన్ అధికారులకు తాను ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చానని..తన  కుటుంబ సభ్యుల వివరాలు అందచేశాడు. కార్పోరేషన్ అధికారులు, పోలీసుల సాయంతో యూపీ లోని కరమ్ సింగ్ కొడుకును సంప్రదించారు. తమ తండ్రి బతికే ఉన్నాడని తెలుసుకున్న కరమ్ సింగ్ కుమారుడు సంతోషించి తన తండ్రిని ఇంటికి పంపాలని కర్ణాటక అధికారులను కోరాడు. త్వరలోనే కరమ్ సింగ్ ను ఒక స్వఛ్చంద సంస్ధద్వారా ఉత్తర ప్రదేశ్ పంపిస్తామని మైసూర్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.