గ్రీన్ టాక్స్: పాత వాహనాలకు ఏడాదికి రూ.3800 పన్ను

గ్రీన్ టాక్స్: పాత వాహనాలకు ఏడాదికి రూ.3800 పన్ను

Old vehicle owners:పాత వాహనాలపై పన్ను విధించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వాహనాలపై గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకోగా.. రాష్ట్రాలకు కూడా ప్రతిపాదనలు పంపింది. వాహనాలు ఫిటినెస్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో 50శాతం గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు చేయాలని భావిస్తున్నట్లుగా అందులో స్పష్టించేసింది.

పాత వాహనాల కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండగా.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో పరిస్థితి చేయి జారి పోతుందని కేంద్ర రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు. దీంతో 8ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించే అవకాశం ఉంది. పదిహేనేళ్ల కంటే పాతవైన వ్యక్తిగత వాహనాలు గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ట్యాక్స్‌ ద్వారా వసూలైన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు ఉపయోగిస్తారు.

కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు అత్యధిక గ్రీన్‌ ట్యాక్స్‌ (రోడ్డు పన్నులో 50 శాతం) వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.

అదే సమయంలో పదిహేనేళ్లు పైబడిన ప్రైవేటు వాహనాలతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, పీఎస్‌యులలో ఉన్న కాలం చెల్లిన కార్లు డీరిజిస్టర్ చేసి స్క్రాప్‌ చెయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వ వాహనాల స్క్రాపేజ్ విధానం 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.