Omicron : ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లైన్స్

ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడ పుట్టిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు.

10TV Telugu News

Omicron : ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడ పుట్టిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒమిక్రాన్ భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ”అంతర్జాతీయ ప్రయాణీకులపై దృష్టి పెట్టాలి. కరోనా పరీక్షలు పెంచాలి. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ ను వెంటవెంటనే పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని గైడ్ లైన్స్ లో కేంద్రం సూచించింది.

ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ చేయాలన్నారు. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్-19 పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తించామన్నారు. హాట్‌ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలన్నారు. తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలన్నారు.

Omicron : భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.. 8 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు

కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబ్ లను వినియోగించుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలన్నారు. ఒమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ (చైనా) దేశాల్లో గుర్తించారు.

క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ వేరియంట్‌ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే ‘రిస్క్’ కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది.

ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్, బ్రిటన్ దేశాల్లో బయటపడింది. బీ.1.1.529 ను ఆందోళనకర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్‌ కూడా అప్రమత్తం అయ్యింది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా వైరస్‌ మరో కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త రకం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని సూచించింది.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంది. పండుగలు, ఇతర వేడుకల్ని కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదంది.

వైరస్‌ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురు లేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచించారు.

×