పార్టీ ఫౌండేషన్ డేకు ముందు రోజే విదేశాలకు రాహుల్ గాంధీ

పార్టీ ఫౌండేషన్ డేకు ముందు రోజే విదేశాలకు రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం (ఫౌండేషన్ డే)కు ఒక రోజు ముందుగానే విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు రాహుల్ గాంధీ. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ వ్యక్తిగత కారణాల రీత్యా విదేశాలకు వెళ్లనున్నారు. కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చేస్తారు’ అని వెల్లడించారు. ఇటలీలోని మిలాన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ అమ్మమ్మ అక్కడే ఉంటుండగా గతంలోనూ రాహుల్ అక్కడికి వెళ్లారు.

ఈ విషయంతో మరోసారి రాహుల్ రాజకీయాల పట్ల అంత సీరియస్ గా లేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. పార్టీ ఫౌండేషన్ డేను పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయల్దేరుతున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ప్రెసిడెంట్ కోసం అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మళ్లీ రాహుల్ పై ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తుంది.

ఆదివారం ఉదయం రైతుల ఆందోళన గురించి ట్వీట్ చేసిన రాహుల్.. డిమాండ్లు తీర్చుకునే వరకూ ఆందోళన ఆపకూడదని రాసుకొచ్చారు. అయితే సోమవారంతో 136వ కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు కనిపించనే లేదు. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా పార్టీ సీనియర్ లీడర్లంతా అక్బర్ రోడ్ హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరి పార్టీ జెండా ఎగరేయనున్నారు.

వారితో పాటు ప్రియాంక గాంధీ వాద్రా కూడా బయటికొస్తారా.. అనేది అనుమానంగా ఉంది. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కరోనా మహమ్మారి రీత్యా పబ్లిక్ తో కలవడాన్ని దూరం పెడుతున్నారు.

ఫౌండేషన్ డే సందర్భంగా జాతీయవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కాంగ్రెస్ చూస్తుంది. రాష్ట్రాలు, జిల్లాల్లో ఉన్న యూనిట్లు తిరంగా ర్యాలీ చేపట్టడంతో పాటు, సోషల్ మీడియాలో సెల్ఫీ విత్ తిరంగా అనే ప్రచారం కూడా చేయనున్నారు. పార్టీ లీడర్లంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటూ అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.