ఆయుధాల కొనుగోలులో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ

ఆయుధాల కొనుగోలులో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ

లద్ధాక్‌లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల రంగ ప్రవేశం. ముడుపులు. కుంభకోణాలు. ఇది మన సైనిక దళాల అనుభవం. ఈసారి వేల కోట్ల రూపాయల ఆధునిక ఆయుధాల కొనుగోళ్ళకు మోడీ సర్కారు సైనికాధికారులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది .

ఢిల్లీలోని రక్షణ మంత్రి కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ , రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు . అదికాదు అసలు కథ . సాయుధ దళాలకు ఆయుధాలు సమకూర్చే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌ను సమావేశానికి పిలిపించారు. ఆపరేషనల్ ఎమర్జెన్సీ కోసం అదనంగా మరో 300 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేయవలసిందిగా కౌన్సిల్‌ను ఆదేశించారు. అప్పటికే కొన్ని వారాలుగా కౌన్సిల్ అదే పని మీద ఉంది.

ఇండియా, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ పొడవునా ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా కౌన్సిల్‌కు అత్యవసర అధికారాలు ఇచ్చారు. ఆధునిక ఆయుధాలు కొనుగోలు కోసం క్యాపిటల్ బడ్జెట్ నుంచి అవసరమైన నిధులు ఖర్చు చేసే అధికారం ఇప్పుడు భారత సైన్యానికి దఖలు పడింది. గతంలో ఎప్పుడూ సైన్యానికి ఇలాంటి అధికారాలు ఇవ్వలేదు. ఆయుధాల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం నివారించడానికి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2016లో కాశ్మీర్‌లోని ఉరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి తరువాత కూడా ఆయుధాల కొనుగోలు కోసం సైన్యానికి కొన్ని పరిమిత అధికారాలు ఇచ్చారు. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా ఆయుధాల కొనుగోలు కోసం సైన్యానికి మరిన్ని అత్యవసర అధికారాలు కల్పించారు. అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చెయ్యడానికి సైన్యానికి 7వేల 500కోట్ల రూపాయలు రాజనాథ్ సింగ్ మంజూరు చేశారు. ఈ నిధులతో సైనికాధికారులు 72వేల సిగ్ 716 రకం అసాల్ట్ రైఫిళ్లు కొనుగోలు చేస్తున్నారు.

యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, ట్యాంకులకు అవసరమైన మందుగుండు కొనుగోలు చేస్తారు. అత్యంత చలి ప్రదేశాల్లో సైనికులు ధరించే ప్రత్యేక దుస్తులు కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వనున్నారు. స్పైస్ బాంబులు , అదనంగా హెరాన్ డ్రోన్లు కొనుగోలు చేయనున్నారు. సైనికుల భుజాలపై నుంచి ప్రయోగించే ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కూడా సమకూర్చుకోనున్నారు. అమెరికా, రష్యా , ఇజ్రాయెల్, ఫ్రాన్స్, మరికొన్ని దేశాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు.

కొన్ని ఆర్డర్లు ఇప్పటికే ఇచ్చారు . మరికొన్ని తుది దశలో ఉన్నాయి. అత్యవసర ఆయుధాల కోసం త్రివిధ దళాలు తమ తమ జాబితాలు ఇప్పటికే అందజేశాయి . తమ అవసరాల కోసం ఉంచుకున్న క్షిపణులు కూడా ఇండియాకు అమ్మడానికి ఫ్రాన్స్ సంసిద్ధత తెలిపింది. ఆ దేశం నుంచి ఇండియా రఫెల్ ఫైటర్స్ జెట్స్ కొనుగోలు చేస్తున్నందున ఫ్రాన్స్ ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నెలాఖరులో తొలి విడత రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు చేరనున్నాయి.

మరోపక్క రష్యా , ఇజ్రాయెల్ కూడా సకాలంలో ఆయుధాలు సరఫరా చేయడానికి తమ సంసిద్ధత తెలిపాయి. ఆయుధాల కొనుగోలు కోసం సైన్యానికి అత్యవసర అధికారాలు ఇవ్వడాన్ని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సమర్ధించుకున్నారు. ఆయుధాల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించడం అవసరమన్నారు. లద్ధాక్‌లో చైనా ఆగడాలు అరికట్టాలంటే సైన్యం అవసరాలు తీర్చడం ముఖ్యమని అన్నారు.