వందేళ్లకొకసారి వచ్చే సంక్షోభం ఇది..మంత్రులందరూ ప్రజలకు టచ్ లో ఉండండి

వందేళ్లకొకసారి వచ్చే సంక్షోభం ఇది..మంత్రులందరూ ప్రజలకు టచ్ లో ఉండండి

Once In A Century Crisis Pm Modi Asks All His Ministers To Be In Touch With People Of Their Regions

MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌లు నిరంతరం స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న‌ట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్​ విధానంలో జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సంబంధించి మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుప‌ర‌చ‌డం, హాస్పిట‌ల్స్ బెడ్స్‌ను పెంచ‌డం, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, ఉత్ప‌త్తిని పెంచ‌డం సహా బలహీన వర్గాల వారికి ఉచిత ఆహార ధాన్యాలు అందించడం సహా..జన్​ధన్ ఖాతాదారులకు ఆర్థిక సహాయం గురించి కూడా సమావేశంలో చర్చించారు. మే 1 నుంచి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ మొదలుకానుండటంతో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ప్రధాని మంత్రులతో చర్చించారు.

క‌రోనా ప్ర‌పంచానికి పెను స‌వాలునే విసిరింద‌ని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. మంత్రులందరూ తమ తమ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని మోడీ సూచించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ప్రధాని.. స్థానికంగా ఉండే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 కోట్ల టీకాలను ప్రజలకు అందించినట్లు ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఇక ఇప్ప‌టికే మూడు వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌గా.. మ‌రికొన్ని వ్యాక్సిన్లు వివిధ ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. కరోనా మహమ్మారిని వందేళ్లకోసారి వ‌చ్చే సంక్షోభంగా కేంద్ర కేబినెట్ పేర్కొంది.

ఇదిలాఉండగా, దేశంలో గత 14 రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఒడిశాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆక్సిజన్ లభ్యత గురించి ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని, 23 రాష్ట్రాలకు 8,593 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సప్లయ్ చేసినట్లు తెలిపింది.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ జరపాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించినట్లు పేర్కొంది.