థియేటర్ లో జాతీయగీతం…కూర్చున్నందుకు యువకుడు అరెస్ట్

10TV Telugu News

సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో  జాతీయగీతం వచ్చిన సమయంలో నిలబడని వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం(మే-8,2019)ఈ ఘటన జరిగింది.

వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరుకి వచ్చిన జితిన్(29)మంగళవారం మాగ్రథ్ రోడ్ లోని గరుడ మాల్ లో అవెంజర్స్ సినిమా చూపేందుకు వెళ్లాడు.సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ప్లే అవుతున్న సమయంలో జితిన్ నిలబడకుండా సీట్లోనే కూర్చుండిపోయాడు.దీంతో జాతీయగీతం ప్లే అవుతున్న సమయంలో ఎందుకు నిలబడలేదంటూ పక్క సీటులో ఉన్న సుమన్ కుమార్ అనే యువకుడు జితిన్ ను ప్రశ్నించాడు.ఈ విషయమై ఇద్దరిమధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి.జితిన్ సుమన్ కుమార్ ని బూతులు తిట్టడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య వాదనలు ముదరడంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇద్దరినీ థియేటర్ స్టాఫ్ బయటికి పంపించివేశారు.

జాతీయగీతానికి వ్యతిరేకంగా జితిన్ అభ్యంతరకరమైన పదాన్నివాడాడని ఆరోపిస్తూ సుమన్ కుమార్ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో  బుధవారం జితిన్ పై కంప్లెయింట్ చేశారు.సుమన్ కంప్లెయింట్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ సెక్షన్ 2కింద జితిన్ ను బుధవారం అరెస్ట్ చేసినట్లు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శశిధర్ తెలిపారు.అదే రోజున స్టేషన్ బెయిల్ పై జితిన్ విడుదలైనట్లు ఆయన తెలిపారు.సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2016 నుంచి థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ప్లే చేయడం తప్పనిసరి.జాతీయగీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ లేచి నిలబడాలి.ఒక్క వికలాంగులు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంది.