రైతున్నల కోసం ముఖ్యమంత్రి ఉపవాసం

  • Published By: vamsi ,Published On : December 14, 2020 / 11:47 AM IST
రైతున్నల కోసం ముఖ్యమంత్రి ఉపవాసం

తిండి పెట్టే రైతన్నలకు మద్దతుగా దేశం మొత్తం నిరసన గళం విప్పింది.. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళనలు చేస్తుండగా.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా ఒక రోజు ఉపవాసం చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆప్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలు కూడా ఒక్క రోజు నిరాహార దీక్ష‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

కొత్తగా కేంద్రం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తన అహంకారం వీడాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నక్సలైట్లు రైతు పోరాటంలోకి చొరబడ్డారని కేంద్రం చేస్తున్న వాదనను నిరసించారు కేజ్రీవాల్, “మాజీ సైనికులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, స్క్రీన్ సెలబ్రిటీలు ఈ పోరాటానికి సహకారం అందిస్తున్నారు, వారంతా కూడా నక్సలైట్లేనా?” అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన దీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా మూడు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు భరోసా ఇస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. మరో వైపు రైతులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతుండగా.. కేంద్రం వెనక్కి తగ్గట్లేదు.

కేంద్రం తీసుకుని వచ్చిన చట్టాలు తమకు ఉపయోగపడవని, మండి వ్యవస్థతో సహా కనీస మద్దతు ధర నాశనం అవుతుందని, వ్యవసాయ ప్రైవేటీకరణ చేతుల్లో చిక్కుకుపోతుందని రైతులు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల, ఈ కొత్త చట్టాలను రద్దు చేయకూడదని వారు పట్టుబడుతున్నారు. దీనిపై పట్టుబట్టి పంజాబ్, హర్యానా సహా రాష్ట్రాల నుండి వెయ్యి మందికి పైగా రైతులు .ఢిల్లీని ముట్టడించి పోరాడుతున్నారు. తీవ్రమైన పోరాటాల కారణంగా రాజధాని స్తంభించిపోతుంది.