బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం…కార్యకర్త మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2020 / 08:10 PM IST
బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం…కార్యకర్త మృతి

One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ‘ఉత్తరకన్య అభిజన్‌’ పేరుతో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు.



సిలిగురిలోని రాష్ట్ర సచివాలయ దక్షిణ బంగాల్ యూనిట్ వరకు ర్యాలీగా వెళ్లాలని బీజేపీ కార్యకర్తలు యత్నించగా…నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు వాటిని తొలగించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక బారికేడ్‌కు నిప్పుపెట్టారు.



ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతోపాటు నీటి ఫిరంగులు,టియర్‌ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీజేపీ కార్యకర్త ఉలెన్ రాయ్ హాస్సిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. మరికొందరు బీజేపీ కార్యకర్తలతోపాటు పలువురు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. కాగా తమ కార్యకర్త మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా మంగళవారం(డిసెంబర్-8) నార్త్ బెంగాల్ లో 12 గంటల బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది.



పోలీసుల తీరుపై బీజేపీ ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుత నిరసనలు చేసిన చాలా మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని…బెంగాల్​ లో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని తేజస్వీ సూర్య విమర్శించారు. మమత పోలీసులు విసిరిన నాటు బాంబుల కారణంగా అయిన గాయాలతోనే బీజేపీ సీనియర్ కార్యకర్త ఉలెన్ రాయ్ మరణించారని తేజస్వీ సూర్య ఆరోపించారు. మరోవైపు, ఉలెన్ రాయ్ మృతికి కారణాలు ఏమిటన్నది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు.