లాక్ డౌన్ వేళ మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 01:29 PM IST
లాక్ డౌన్ వేళ మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ

సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గాన్ని సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ విస్త‌రించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఐదుగురు నూత‌న మంత్రుల‌తో గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. న‌రోత్తం మిశ్రా, తుల‌సి సిలావ‌త్‌, గోవిండ్ సింగ్ రాజ్‌పుత్‌, మీనా సింగ్‌, క‌మ‌ల్ ప‌టేల్ మంత్రులుగా తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

తాజా మంత్రుల్లో ఇద్ద‌రు శిలావ‌త్‌, రాజ్‌పుత్‌ గ‌తనెల‌లో రాజీనామా చేసిన క‌మ‌ల్‌నాథ్ మంత్రివ‌ర్గంలోని స‌భ్యులు కావ‌డం విశేషం. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవాళ్లతో సీఎం కేబినెట్ భేటీ నిర్వహించారు. కాగా,గత నెలలో మెజార్టీ కోల్పోడంతో బలపరీక్షను ఎదుర్కోకముందే మధ్యప్రదేశ్ సీఎం పదవికి క‌మ‌లనాథ్ రాజీనామా చేయడంతో ఆయ‌న స్థానంలో బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ గ‌త‌నెల 23న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

అయితే అప్ప‌టి నుంచి దాదాపు నెల‌రోజులుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌ప‌క‌పోవ‌డంతో పెద్ద‌ ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. చౌహాన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యానికి రాష్ట్రంలో కేవ‌లం 9 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. ఈ 29 రోజుల్లో ఆ సంఖ్య 1400 మార్కును దాటింది. 76 మంది మ‌ర‌ణించారు. క‌రోనా ఉధృతంగా కొన‌సాగ‌తున్న వేళ రాష్ట్రంలో క‌నీసం ఆరోగ్య‌మంత్రి కూడా లేరని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖనే అతిపెద్ద హాట్ స్పాట్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చౌహాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల్లో మ‌ధ్యప్రదేశ్ ఒక‌టి. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో 1480కిపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 

	mp2.JPG