One Nation One PUC : ఇకపై దేశవ్యాప్తంగా వాహానాలకు ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్

One Nation One PUC : ఇకపై దేశవ్యాప్తంగా వాహానాలకు ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్

One Nation One Puc

One Nation One PUC : దేశ వ్యాప్తంగా ప్రయాణించే అన్ని వాహనాలకు సౌలభ్యంగా ఉండేందుకు ఇకనుంచి ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి కొత్తగా ఇచ్చే పొల్యూషన్ సర్టిఫికెట్‌లో క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ఆకోడ్‌ను స్కాన్ చేస్తే వాహన యజమాని పేరుతో పాటు అతని ఫోన్ నెంబరు, చిరునామా, ఇంజన్ నెంబర్, ఛాసిస్ నెంబర్, వాహానం ఎంతస్ధాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నిటినీ పొందుపరుస్తారు.

ఇక నుంచి పొల్యూషన్ చెక్ చేయించుకునేటప్పుడు యజమాని సెల్‌ఫోన్ నెంబరు నమోదు చేయటం తప్పనిసరి చేశారు. వ్యాలిడేషన్, చెల్లింపులు తదితర వివరాలను మెసేజ్ ద్వారా యజమాని ఫోన్‌కు పంపిస్తారు. పరిమితికి మించి వాహనంలోంచి ఉద్గారాలు వెలువడుతుంటే ఇకపై రిజెక్షన్ స్లిప్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర మోటారు వెహికల్ చట్టాలు-1989 లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల మంత్రిత్వశాఖ తాజాగా జూన్ 14న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి పీయూసీ డేటాబేస్‌ను జాతీయ రిజిష్టర్‌తో అనుసంధానం చేస్తారు.

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ప్రక్రియ అమలవుతున్న నేపధ్యంలో వాహానాలను రెన్యువల్ చేయించుకోలేని వారికోసం కేంద్రం మరో ఉపశమనం కలిగించింది. డ్రైవింగ్‌ లైసెన్స్, వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ), ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లతో పాటు అన్ని రకాల పర్మిట్ల చెల్లుబాటును సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన మోటారు వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.