షాకింగ్.. శానిటైజర్లతో కరోనావైరస్ చావడం ఏమో కానీ అంధత్వం వచ్చే ప్రమాదం, మార్కెట్‌లో సగం నకిలీవే

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 03:33 PM IST
షాకింగ్.. శానిటైజర్లతో కరోనావైరస్ చావడం ఏమో కానీ అంధత్వం వచ్చే ప్రమాదం, మార్కెట్‌లో సగం నకిలీవే

ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇప్పటివరకు రాలేదు. అందుకే అంతా ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి మాస్కులు ధరిస్తున్నారు. ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకునేందుకు పెద్ద ఎత్తున శానిటైజ‌ర్ల‌ను వాడుతున్నారు. శానిటైజర్లు వినియోగించి హమ్మయ్య ఇక కరోనా బారి నుంచి బయటపడినట్టే అని రిలీఫ్ అవుతున్నారు. కానీ, శానిటైజర్ల గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మార్కెట్ లో సగం శానిటైజర్లు నకిలీవే అని తేలింది. శానిటైజర్లతో కరోనా వైరస్ చావడం మాటేమో కానీ, అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



అంధత్వంతోపాటు ఇర్రివర్సిబుల్‌ ఆప్టిక్‌ నర్వ్‌ డ్యామేజ్‌:
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక ర‌కాల హ్యాండ్ శానిటైజ‌ర్ల‌లో 50శాతం శానిటైజ‌ర్లు న‌కిలీవేన‌ని తేలింది. కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీజీఎస్‌ఐ) నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో విస్తుగొలుపే నిజాలు తెలిశాయి. వారు పరీక్షించిన 122 శాంపిల్స్‌లో 5 విషపూరిత మిథనాల్ కలిగి ఉన్నాయని గుర్తించారు. వాటిలో 50 శాతం శానిటైజ‌ర్లలో క‌ల్తీ జ‌రిగిన‌ట్లు తేల్చారు. ఐదింటిలో అయితే 4శాతం విషపూరిత మిథనాల్(methanol) ఉందట. దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని వారు చెబతున్నారు. అంధత్వంతోపాటు ఇర్రివర్సిబుల్‌ ఆప్టిక్‌ నర్వ్‌ డ్యామేజ్‌ కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

శానిటైజర్లలో హానికారక మిథనాల్:
ఆగస్టు 31, 2020న సిజీఎస్‌ఐ ఈ అధ్యయన వివరాలను నివేదించింది. ముంబై, నవీ ముంబై, థానే, మహారాష్ట్రలోని మార్కెట్లో లభ్యమయ్యే హ్యాండ్ శానిటైజర్లపై అధ్యయనం చేశారు. 120 కి పైగా హ్యాండ్ శానిటైజర్ నమూనాలపై ‘గ్యాస్ క్రోమాటోగ్రఫీ’ పరీక్షను నిర్వహించారు. ఒక్కోదాంట్లో ఉన్న ఆల్కహాల్‌ కంటెంట్‌ను పరిశీలించారు. లేబుళ్లలో తెలిపిన రసాయనాలే శానిటైజర్‌లో ఉన్నాయా? లేవా? అని సరిపోల్చారు. ఇందులో కొన్నింటిలో హానికారక మిథనాల్‌(methanol) ఉన్నట్లు తేల్చారు.



హ్యాండ్ శానిటైజర్స్ ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) ఉత్పత్తి, ఎఫ్‌డీఏచే నియంత్రించబడతాయని వారు చెబుతున్నారు. కానీ, కొంతమంది శానిటైజర్ తయారీదారులు లేబుల్స్‌లో ఇథైల్‌ ఆల్కాహాల్‌(ethyl alcohol) అని చూపించి, అందులో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ లేదా మిథనాల్ ను వాడుతున్నారని తెలిపారు. ఇది తేలికపాటి, అస్థిర, మండే, విలక్షణమైన వాసనతో కూడిన విషపూరిత ద్రవం అని సీజీఎస్‌ నివేదిక తెలిపింది.

ఈథైల్ బదులు మిథైల్ వినియోగం:
సాధార‌ణంగా శానిటైజ‌ర్ల‌ను ఈథైల్ ఆల్క‌హాల్‌ను వాడి త‌యారు చేయాల్సి ఉంటుంది. మిథైల్ ఆల్క‌హాల్ ను వాడ‌డాన్ని నిషేధించారు. అయితే సీజీఎస్ఐ గుర్తించిన క‌ల్తీ శానిటైజ‌ర్ల‌లో మిథైల్ ఆల్క‌హాల్ ఉన్న‌ట్లు గుర్తించారు. దీన్ని ఎక్కువ కాలం పాటు వాడితే అంధ‌త్వం వ‌స్తుంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఇదే విష‌యాన్ని తాము కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ కు తెలియ‌జేస్తామ‌ని సీజీఎస్ఐ స్ప‌ష్టం చేసింది.



నకిలీ శానిటైజర్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు:
క‌రోనా నేప‌థ్యంలో చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అందులో భాగంగానే జ‌నాలు చాలా మంది గ‌తంలో క‌న్నా ఇప్పుడే ఎక్కువ‌గా హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను వాడుతున్నారు. అయితే ఇదే విష‌యాన్ని అదునుగా చేసుకుని కొంద‌రు హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను క‌ల్తీ చేస్తున్నార‌ని, వాటిని మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నార‌ని సీజీఎస్ఐ సెక్రెట‌రీ డాక్ట‌ర్ ఎంఎస్ కామ‌త్ తెలిపారు.

ఆల్కహాల్ అస్సలు ఉండదు, పైగా విషపూరిత మిథైల్ ఆల్కహాల్ తో తయారీ:
సాధార‌ణంగా మ‌నం స‌బ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా హ్యాండ్ శానిటైజ‌ర్‌తో చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. అయితే శానిటైజ‌ర్ల‌లో క‌నీసం 60 శాతం ఆల్క‌హాల్ ఉండాలి. కానీ క‌ల్తీ అయిన హ్యాండ్ శానిటైజ‌ర్ల‌లో ఆల్క‌హాల్ అస్స‌లు ఉండ‌డం లేదు. పైగా నిషేధిత మిథైల్ ఆల్క‌హాల్‌ను ఉప‌యోగించి శానిటైజర్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మని సీజీఎస్ఐ వ్యాఖ్యానించింది. వినియోగ‌దారులు ఈ విష‌యంపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.



CGSI వెల్లడించిన వివరాలు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇన్నాళ్లు మార్కెట్ లో ఏ శానిటైజర్ దొరికితే అది కొనుక్కుని వాడేస్తున్నారు. ఇప్పుడు.. మార్కెట్ లో అందుబాటులో ఉన్న వాటిలో సగం శానిటైజర్లు నకిలీవేనని, వాటిని ఎక్కువగా వాడితే అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని చెప్పడంతో కంగారు పడుతున్నారు.