ఒక ఎన్నికల ఫలితం అంత పవర్ ఇచ్చిందా….అది రాముడిని అవమానించడమే

  • Published By: venkaiahnaidu ,Published On : September 22, 2019 / 11:01 AM IST
ఒక ఎన్నికల ఫలితం అంత పవర్ ఇచ్చిందా….అది రాముడిని అవమానించడమే

హిందూ మతం పేరుతో,రాముడి పేరు చెప్పుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడమంటే …హిందూ ధర్మాన్ని, రాముడిని అవమానించడమేనని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు. 

పుణేలో ఇవాళ(సెప్టెంబర్-22,2019)ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ)లో ఆయన మాట్లాడుతూ…గత ఆరు సంవత్సరాలలో మనం ఏమి చూశాం?పుణెలో మొహిసిన్ షేక్‌తో మొదలైంది. ఆ తర్వాత బీఫ్ పట్టుకెళ్తున్నాడనే అనుమానంతో మెహమ్మద్ అఖ్లక్‌ను చంపేశారు. ఆ తర్వాత అది బీఫ్ కాదని తేలింది. ఒకవేళ అది బీఫ్ అయినప్పటికీ ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరిచ్చారు? పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తి డెయిరీ ఫార్మింగ్ కోసం తన లారీలో ఆవులు తీసుకెళ్లేందుకు లైసెన్స్ ఉందనీ, అతన్ని కొట్టిచంపారని అన్నారు. ఒక ఎన్నికల ఫలితమే వారికి ఎవరినైనా కొట్టి చంపేందుకు, ఏదైనా చేసేందుకు అవసరమైన బలాన్ని ఇచ్చిందా? అని నిలదీశారు. 15 ఏళ్ల బాలుడు జునైద్ ఖాన్‌ను  రైలులో కత్తితో పొడిచి చంపారని అన్నారు. తాను కూడా హిందువేనని,కానీ ఇలాంటి హిందువు కాదని అన్నారు. జై శ్రీరామ్ అనాలంటూ కొంతమంది హింసకు పాల్పడుతున్నారని,ఇది హిందూ ధర్మాన్ని అవమానించడమేనన్నారు. ఇదేనా మన భారతం? మన హిందూ ధర్మం చెప్పింది ఇదేనా? అని థరూర్ ప్రశ్నించారు. 

సంఘటిత భారతం అంటే మతం పేరుతో హింసకు పాల్పడటం కాదని అన్నారు. సంఘటిత భారతం దిశగా పయనించడమంటే స్వాతంత్ర్య పోరాటం గురించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని ప్రస్తావించాలన్నారు. సంఘటిత భారతం అంటే…మహాత్మాగాంధీ చెప్పినట్టు సమాజంలోని బలహీన వర్గాలను ఆదుకుని, వారికి దిశానిర్దేశం చూపించడం మన బాధ్యతని శశిథరూర్ అన్నారు.  సంఘటిత భారతం అందరిదీనని, మతం, భాష, రంగు, వర్ణాలకు అతీతమని అన్నారు.

బీజేపీ హిందూయిజం ఆలోచన ఒక రాజకీయ భావజాలం అని,హిందూ మతంతో దీనికి ఎటువంటి సంబంధం లేదని థరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా హిందూ దుమారంపై జరుగుతున్న చర్చను ప్రస్తావిస్తూ.. తానుమూడు భాషల సూత్రానికి (బహుభాషా సంభాషణా సామర్థ్యాలను ప్రోత్సహించడం) అనుకూలంగా ఉన్నానని థరూర్ చెప్పారు.