ఉల్లి కోస్తుంటేనే కాదు కొనాలంటే కూడా వస్తున్నాయ్ కన్నీళ్లు

  • Published By: vamsi ,Published On : September 24, 2019 / 06:21 AM IST
ఉల్లి కోస్తుంటేనే కాదు కొనాలంటే కూడా వస్తున్నాయ్ కన్నీళ్లు

ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. కూరగాయలు కొరకొర చూస్తున్నాయి. ఏది ముట్టుకున్నాడ జేబులు ఖాళీ అయిపోతున్నాయి. సామన్యుడికి సినిమా కష్టాలు నిజంగానే వచ్చినట్లు కనిపిస్తుంది. కూరలో ఉల్లి వాసన లేకపోతే అది కూరే కాదు. మార్కెట్లో ఉల్లి ధర మాత్రం రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉల్లి ధర కష్టమర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో అయితే ఏకంగా కేజీ ఉల్లి ధర రూ. 70 నుంచి రూ.80 పలుకుతుంది. హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో కేజీ రూ. 50కు పైగా అమ్ముడుపోతుంది. రెండు వారాలుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

మహారాష్ట్ర తదితర ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణాకు అంతరాయం కలుగుతుండటంతో సరఫరా తగినంతగా లేకపోవడం ఇందుకు కారణంగా ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలోనే ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతుంది.

ఢిల్లీలో నాఫెడ్, ఎన్ సీసీఎఫ్ , మదర్ డైరీల ద్వారా కేజీ రూ. 22, రూ. 23.90లకు అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధర బాగా పెరిగిపోయింది. ఉల్లి సాగు చేసిన ప్రాంతాల నుంచి కూడా దీపావళి తర్వాతే ఉల్లి దిగుబడి అయ్యే అవకాశం ఉండడంతో అప్పటివరకు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.