రైతుల ఆందోళనలు…రాష్ట్రపతికి విపక్షాల వినతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 08:56 PM IST
రైతుల ఆందోళనలు…రాష్ట్రపతికి విపక్షాల వినతి

Oppn Delegation Meets President నూతన వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు తేల్చిచెప్పాయి. రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ఇవాళ(డిసెంబర్-9,2020) విపక్ష పార్టీలకు చెందిన 5గురు సభ్యుల బృందం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయింది.



కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, సీపీఐఎమ్​ ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎమ్​కే నేత టీకేఎస్​ ఇళంగోవన్​తో కూడిన బృందం రాష్ట్రపతి భవన్ ​లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసింది. నూతన అగ్రి చట్టాలపై నిరసన తెలుపుతూ ఓ మెమొరాండంని రాష్ట్రపతికి అందించింది విపక్ష సభ్యుల బృందం.



సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ… వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రపతికి వివరించినట్టు చెప్పారు. అప్రజస్వామికంగా ఈ చట్టాలను ఆమోదించిన ప్రభుత్వం.. ఎందరో రైతుల జీవితాలను ప్రమాదంలో పెట్టిందని సీపీఎమ్​ నేత సీతారామ్​ ఏచూరి ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్​ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు ఎన్​సీపీ నేత శరద్​ పవార్​ తెలిపారు. వారి సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.



మరోవైపు,నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో ఇవాళ కేంద్రం జరిపిన ఆరో రౌండ్ చర్చలు కూడా సఫలం కాలేదు. చట్టాల్లో సవరణలకు కేంద్రం ప్రతిపాదించగా,సవరణలు వద్దు చట్టాలు రద్దే కావాలి అంటూ రైతులు తేల్చి చెప్పారు. కేంద్రంతో జరిగిన చర్చలు మరోసారి విఫలం కావడంతో ఈ నెల 12న దేశ వ్యాప్త ఆందోళనలకు రైతు నేతలు పిలుపునిచ్చారు. మూడు చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఉత్పత్తులు వాడకూడదని రైతు సంఘాలు తీర్మానించాయి.