OBC Bill..ప్రభుత్వానికి విపక్షాల మద్దతు

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తొలి రోజు(జులై-19) నుంచే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

OBC Bill..ప్రభుత్వానికి విపక్షాల మద్దతు

Opposition

OBC Bill పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తొలి రోజు(జులై-19) నుంచే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెగసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఓబీసీ బిల్లు విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. 15 విపక్ష పార్టీల నాయకులు సోమవారం ఉదయం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు డీఎంకే, టిఎంసీ, ఎన్‌సీపీ, శివసేన, ఎస్పీ, సీపీఎం, ఆర్జేడీ, ఆప్, సిపిఐ, ఎన్‌సి, ఐయుఎమ్‌ఎల్, ఎల్‌జెడి, ఆర్‌ఎస్‌పి మరియు కెసి (ఎం) పార్టీల నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రాల స్థాయిలో ఇతర వెనుకబడిన తరగతులను(OBC) గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్తూ కేంద్రం సోమవారం లోక్​సభలో ప్రవేశపెట్టనున్న 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లుపై ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని తెలిపాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే తెలిపారు.

కాగా, రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం ద‌క్కాలంటే మూడ‌వ వంతు మ‌ద్ద‌తు అవ‌స‌రం. అయితే ఆ బిల్లుకు విప‌క్షాలు మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో.. బిల్లు పాస్ కావ‌డం అనివార్య‌మే అవుతుంది. అయితే మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.