Lok Sabha Elections 2024: విపక్షాల కీలక నిర్ణయం.. బీజేపీని ఓడించేందుకు వ్యూహం.. భేటీకి ముహూర్తం
దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Nitish Kuamar, Opposition Leaders
Lok Sabha Elections 2024 – Opposition parties: బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా భారత్(India)లోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, విపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 12న బిహార్ (Bihar) రాజధాని పట్నాలో సమావేశం కావాలని నిర్ణయించాయి.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యూహరచన కోసం ఈ సమావేశం నిర్వహించనున్నాయి. దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తాజాగా, 19 విపక్ష పార్టీలు పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లలేదన్న విషయం తెలిసిందే. కలిసి పోరాడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు కీలక నేతలతో వరుసగా సమావేశమై చర్చించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ చర్చించినప్పటికీ తాము కూటమి గురించి చర్చించలేదని నవీన్ పట్నాయక్ అన్నారు.
బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీతో పాటు పలు పార్టీలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. వీలైనన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పెట్టుకున్నాయి. మొదట బీజేపీ, కాంగ్రెస్ కి సమాన దూరం పాటిస్తామని మమతా బెనర్జీ అన్నప్పటికీ హస్తం పార్టీలేనిదే బలమైన కూటమి ఏర్పాటు కాదని ఆమె ఇప్పుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Coffin Remark: పార్లమెంటును శవ పేటికతో పోల్చిన ఆర్జేడీపై విపక్షాల విమర్శలు