ఓటర్లు హాలిడేలో ఉన్నారు : హర్యానా ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ నేత వింత సమాధానం

ఓటర్లు హాలిడేలో ఉన్నారు : హర్యానా ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ నేత వింత సమాధానం

Our Voters On Holiday, Says BJP హర్యానాలో మున్సిపల్ కార్పొరేషన్లకు గత వారం జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మూడింట ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీ మిత్రపక్షం జన్‌నాయక్ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీకి బాగా పట్టున్న ప్రాంతాలైన సోనిపట్, అంబాలాలో దారుణంగా ఓటమి పాలైంది. వ్యవసాయ చట్టాల ప్రభావం కారణంగానే బీజేపీ-జేజేపీ కూటమి ఓటమి పాలైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో ఓటమికి వేరే కారణం ఉందని బీజేపీ నేత సంజయ్ శర్మ చెప్పుకొచ్చారు. బీజేపీ ఓటర్లు హాలిడేలో(సెలవు)ఉండటం వల్లే తాము ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

హర్యాణా బీజేపీ ప్రతినిధి సంజయ్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ఓటర్లు హాలిడేలో(సెలవులో)ఉండటం వల్లే మేము ఓడిపోవాల్సి వచ్చింది. డిసెంబర్ 25, 26, 27 మూడు రోజులు సెలవులు ఉన్నాయి. అంతే కాకుండా డిసెంబర్‌ ఈ ఏడాదికి ముగింపు కావడంతో ప్రజలంతా హాలీడే మూడ్‌లో ఉన్నారు. కొందరు బయటి ట్రిప్పులకు కూడా వెళ్లారు. అయితే ఇలా హాలీడేలో ఉన్న ఎక్కువ మంది ఓటర్లు బీజేపీ సానుభూతి పరులే. అది మా ఓటు బ్యాంకే. అందుకే ఈ ఎన్నికల్లో తాము ఓడిపోవాల్సి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ శర్మ అన్నారు.

ఇదే విషయమై అంబాల ఎమ్మెల్యే అసీమ్ గోయెల్ మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బీజేపీకి వ్యతిరేకంగానే పని చేశారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తోంది. ఇలాంటి ప్రభుత్వంతో అందరూ చేతులు కలిపి అనేక మైలు రాళ్లు దాటాలి. కానీ హర్యానాలో జరిగేది వేరు. ప్రతిపక్షాల ఎజెండా ప్రభుత్వాన్ని ఏ పని చేయకుండా అడ్డుకోవడమే. అందరూ మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. తమలో తమకు ఏమైనా విబేధాలుంటే తర్వాత చూసుకుందాం, ముందు బీజేపీ సంగతి చూద్దాం అన్నట్లుగా వాళ్లు ఏకమయ్యారు అని అన్నారు.

కాగా,హర్యానా మున్సిపిల్ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో3 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ ఎన్నికలు జరగ్గా బీజేపీ ఒక మేయర్ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ-జేజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. పంచుకుల మేయర్ స్థానం అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకోగా, సోనిపట్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక అంబాలాలో హర్యానా జన్ చేతన పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ విజయం సాధించారు. రేవరి మున్సిపల్ కౌన్సిల్‌తో పాటు ధరుహెర, ఉక్లానా, సంప్లా మున్సిపల్ కమిటీలకు కూడా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క రేవరి మున్సిపల్ కౌన్సిల్‌‌ని మాత్రమే గెలుచుకోగలిగింది.