ఇండియాలో 10వేలకు పైగా కంపెనీలు క్లోజ్, కరోనా ఎఫెక్ట్

తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.

ఇండియాలో 10వేలకు పైగా కంపెనీలు క్లోజ్, కరోనా ఎఫెక్ట్

Over 10,000 companies closed down in FY21: ఏడాదిన్నర కావొస్తోంది. అయినా ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా భయం తొలగలేదు. యావత్ ప్రపంచం కొవిడ్ మహమ్మారితో పోరాటం చేస్తూనే ఉంది. కంటికి కనిపించని కరోనావైరస్.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసింది. ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు.

తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.

గతేడాది(2020) ఏప్రిల్‌ నుంచి ఈ ఫిబ్రవరి(2021) వరకు దేశంలో 10వేలకి పైగా(10వేల 113) కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధాలు ఏర్పడటం ఇందుకు కారణం అని తెలిపింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు. ఎలాంటి చట్టపరమైన చర్యల వల్ల కాకుండా.. స్వచ్ఛందంగానే వ్యాపారాలను కంపెనీలు ఆపేశాయనే విషయాన్ని సెక్షన్‌ 248(2) తెలియజేస్తుంది.

అత్యధికంగా ఢిల్లీలో 2,394 కంపెనీలు మూతపడగా.. ఉత్తరప్రదేశ్‌ (1,936 కంపెనీలు) ఆ తర్వాతి స్థానంలో ఉంది. తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్‌లో 501, రాజస్థాన్‌లో 479, తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్‌లో 137, మధ్యప్రదేశ్‌లో 111, బిహార్‌లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు.

2020-21లో వ్యాపారాలను ఆపేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరాలు తెలియజేశారు.

మరోవైపు దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా..1,57,930 మంది ప్రాణాలు వదిలారని మంగళవారం(మార్చి 9,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.