Corona Children : 2 నెలల్లో 17వేల 688 మంది చిన్నారులకు కరోనా

దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.

Corona Children : 2 నెలల్లో 17వేల 688 మంది చిన్నారులకు కరోనా

Corona Third Wave

Corona Children : దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి. థర్డ్ వేవ్ లో కరోనాతో చిన్నారులకు ఎక్కువ ముప్పు పొంచి ఉందని నిపుణులు ఇదివరకే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వారు అన్నట్టే పిల్లలపై కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌కు అధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రను థర్డ్‌వేవ్ వణికిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో పెద్దఎత్తున చిన్నారులు కరోనా బారినపడటం కలకలం రేపుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ జిల్లాలో 18 ఏళ్ల లోపు చిన్నారుల్లో 17వేల 688 మందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్​లో 7వేల 760మంది, మే నెలలో 9వేల 928 మందికి వైరస్​ సోకినట్లు జిల్లా సర్జన్ డాక్టర్‌ సునీల్​ పోఖ్​రాణా వెల్లడించారు. దీంతో వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు.

మొత్తం పాజిటివ్​ కేసుల్లో 18 ఏళ్ల లోపు వారే 8 నుంచి 10 శాతం ఉన్నారని ఆయన చెప్పారు. ఈ గణాంకాలను జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే సైతం ధ్రువీకరించారు. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలే అధికంగా ప్రభావితమవుతారని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ లెక్కలు ముందు జాగ్రత్తల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్నపిల్లల డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో పడకలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మూడో దశ సమయంలో దానిని నివారించేందుకు కృషి చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్కూల్ వాతావ‌ర‌ణాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న వేళ థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్‌లో చిన్నారులను కరోనా టార్గెట్ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు చేపట్టాయి. అయినప్పటికి కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది.