కరోనా కేసుల్లో చైనాను దాటేసిన మహారాష్ట్ర

  • Published By: venkaiahnaidu ,Published On : June 7, 2020 / 03:59 PM IST
కరోనా కేసుల్లో  చైనాను దాటేసిన మహారాష్ట్ర

కరోనా కేసుల్లో..వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాని దాటేసింది మహారాష్ట్ర. భారత్ లో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 2.5లక్షలు దాటగా,ఒక్క మహారాష్ట్రలోనే 86వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలవడమే కాకుండా…వైరస్ పుట్టిన చైనానే మహారాష్ట్ర దాటేసింది.

చైనాలో ఇప్పటివరకు 83వేల కరోనా కేసులు నమోదుకాగా,గడిచిన 24గంటల్లో 3వేల కొత్త కరోనా కేసులతో మహారాష్ట్ర చైనాను దాటేసింది. మహారాష్ట్రలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 3వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

తమిళనాడులో దాదాపు 32వేల కరోనా కేసులు 270మరణాలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,గుజరాత్ లో కూడా కరోనా విజృంభిస్తోంది. దేశరాజధానిలో కరోనా కేసుల సంఖ్య 28వేలకు చేరగా,గుజరాత్ లో 20వేలకు చేరాయి. యూపీలో కేసులు 10వేలు దాటాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా మరణాలు గుజరాత్ లో నమోదయ్యాయి. గుజరాత్ లో ఇప్పటివరకు 1200మందికి పైగా మరణించారు.