5కోట్ల రైతులకు ఇంకా అందని పీఎం-కిసాన్ మూడో విడుత నిధులు

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 08:56 PM IST
5కోట్ల రైతులకు ఇంకా అందని పీఎం-కిసాన్ మూడో విడుత నిధులు

రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో  ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 5.16కోట్లమంది రైతులకు ఇంకా మూడో విడుత సాయం అందలేదని కేంద్రం తెలిపింది. 2.51కోట్ల మందికి ఇంకా రెండో విడుత నిధులు అందలేదని తెలిపింది.

ఈ పథకం 2018 డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏడాది గడిచినా ఇప్పటికీ కనీసం ఒక్కసారి కూడా తొమ్మిది కోట్ల మందిలో అందరికీ చెల్లింపులు జరిగిన పరిస్థితి లేదని వెల్లడైంది. పీఎం-కిసాన్‌ చెల్లింపుల వివరాల కోసం పీటీఐ వార్తాసంస్థ విలేకరి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు బదులిచ్చింది.

ఈ పథకం కింద 2018 డిసెంబర్ నుంచి 2019 నవంబర్ మధ్య 9 కోట్లకు పైగా రైతులు స్వయంగా తమ పేరును నమోదు చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే 9కోట్లకు పైగా లబ్ధిదారులు ఉంటే అందులో 84శాతం(7.62కోట్లు)మందికి మాత్రమే మొదటి విడుత నిధులు అందాయని తెలిపింది. 6.5 కోట్ల మందికి రెండో విడుత, 3.85 కోట్ల మందికి లబ్ధిదారులకు మాత్రమే మూడో విడుత ద్వారా నగదును వారి అకౌంట్లలో వేసినట్లు కేంద్రం తెలిపింది.