CoWIN: కోవిన్ కోసం ఆసక్తి చూపిస్తున్న 50దేశాలు.. సాఫ్ట్‌వేర్ ఇచ్చేందుకు ఇండియా రెడీ!

కెనడా, మెక్సికో, నైజీరియా, పనామాతో సహా 50 దేశాలు తమ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి కో-విన్ లాంటి వ్యవస్థ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.

CoWIN: కోవిన్ కోసం ఆసక్తి చూపిస్తున్న 50దేశాలు.. సాఫ్ట్‌వేర్ ఇచ్చేందుకు ఇండియా రెడీ!

Cowin

CoWIN: కెనడా, మెక్సికో, నైజీరియా, పనామాతో సహా 50 దేశాలు తమ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి కో-విన్ లాంటి వ్యవస్థ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ అధికారి, కోవిడ్ -19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ కోసం సాధికారిక గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ.. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ కావడానికి కో-విన్ ప్లాట్‌ఫాం కూడా ఓ కారణం.. దీంతో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాతో సహా.. 50 దేశాలు కోవిన్ వంటి వ్యవస్థను కలిగి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నాయని శర్మ చెప్పారు. జూలై 5 న ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, సాంకేతిక నిపుణుల వర్చువల్ గ్లోబల్ కాన్‌క్లేవ్ జరుగుతుందని, ఈ సమావేశంలో ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో భారతదేశం ఆయా దేశాలతో పంచుకుంటుందని చెప్పారు.

“ఈ వ్యవస్థ ఎలా పని చేయగలదో? వారికి వివరిస్తామని చెప్పారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఏ దేశంతోనైనా ఉచితంగా పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి తెలియజేస్తున్నాము. కెనడా, మెక్సికో, పనామా, పెరూ, అజర్‌బైజాన్, ఉక్రెయిన్, నైజీరియా, ఉగాండా నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు.”అని శర్మ అన్నారు.

వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర దేశాలు తమ సొంత కోవిడ్ కార్యక్రమాలను నిర్వహించడానికి తమ దేశాలలో దీనిని అమలు చేయడానికి కో-విన్ ప్లాట్‌ఫాం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఐదు నెలల్లో కో-విన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా 30కోట్ల ప్లస్ రిజిస్ట్రేషన్లు చేసి వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పారు. ప్రజలు వ్యాక్సిన్ పొందేందుకు డిజిటల్‌గా కోవిన్ బాగా సాయపడిందని అన్నారు.