Ayodhya: నేడు అయోధ్యకు 50 లక్షల మంది భక్తుల రాక.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

Ayodhya: రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మొదటి రోజున అయోధ్యలో గడపడం చాలా మందికి అలవాటు. ఈ సందర్భంగా జనవరి 1, ఆదివారం రోజు భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యను సందర్శించబోతున్నారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్లు సిద్ధం చేశారు. రద్దీని నియంత్రించేందుకు, తొక్కిసలాట జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్త సంవత్సరం రోజున రామ భక్తులు అయోధ్యను సందర్శించడం కొన్నేళ్లుగా సంప్రదాయంగా వస్తోంది.
గతేడాది జనవరి 1న 30 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఈ సారి అంతకంటే ఎక్కువ మంది రావొచ్చని ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ అంచనా వేసింది. గత సంవత్సరం మొత్తం 2.5 కోట్ల మంది భక్తులు రామజన్మ భూమిని దర్శించుకున్నారు. వీరిలో 25,000 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరగొచ్చని అంచనా.