Indian citizenship : భారత పౌరసత్వం వదులుకున్న 6 లక్షల మంది

2017 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.

Indian citizenship : భారత పౌరసత్వం వదులుకున్న 6 లక్షల మంది

Citizenship

Indian citizenship: 2017 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది. మంగళవారం సభ్యులు ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2017 ఏడాదిలో 1,33,049 మంది, 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,248, 2021లో సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రమంత్రి తెలిపారు.

ఇక,2016-2020 మధ్య కాలంలో…. 10,645 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో 4,177 మందికి పౌరసత్వం అందించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2016లో భారత పౌరసత్వం కోసం మొత్తం 2,262 మంది దరఖాస్తు చేసుకోగా, 2017లో 855 మంది, 2018లో 1,758 మంది, 2019లో 4,224 మంది, 2020లో 1,546 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువగా పాకిస్తాన్ ప్రజలే ఉన్నారన్నారు. మొత్తం 7,782 మంది పాకిస్తానీలు, అఫ్గానిస్థాన్ నుంచి 795 మంది, అమెరికా నుంచి 227 మంది, బంగ్లాదేశ్ నుంచి 184,నేపాల్ నుంచి 167 కెన్యా నుంచి 185 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద అర్హులైన వ్యక్తులు నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాయ్ లోక్‌సభకు తెలిపారు. ఇక, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 33,83,718 అని నిత్యానంద రాయ్ తెలిపారు.

మరోవైపు, కులాలవారీగా జనగణనపైనా స్పందించిన నిత్యానంద రాయ్… స్వాతంత్ర్యం తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా షెడ్యూలు కులాలు, తెగల వివరాలనే సేకరిస్తున్నామన్నారు. 2021 జనగణనపై 2019 మార్చిలోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని,అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. సంబంధిత మంత్రులతో సమావేశమైన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ALSO READ Farmers Protest : రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే..డిసెంబర్-4న ఆందోళన ముగింపు!