అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన కారు ఓనర్ అనుమానాస్పద మృతి

అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన కారు ఓనర్ అనుమానాస్పద మృతి

Owner గత వారం ముంబైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటికి దగ్గర్లో నిలిపిఉంచిన ఓ స్కార్పియో కారులో జిలెటిన్ స్టిక్స్ ఉండటం పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఆ కారు యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ శుక్రవారం(మార్చి-5,2021) అనుమానాస్పదంగా మరణించారు. థాణేలోని రేతీ బండార్ ఏరియాలోని ఓ కాలువలో తేలిన ఆయన మృతదేహాన్ని నౌపాడా పోలీసులు వెలికితీశారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ADR)రిజిస్ట్ చేసినట్లు థానే డీసీపీ తెలిపారు. గురువారం రాత్రి ఎవరో సాహెబ్ ను కలవడానికి వెళ్లున్నాను హిరేన్ చెప్పాడని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

ఫిబ్రవరి-26 సాయంత్రం ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులోని ముఖేష్‌ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద ఓ స్కార్పియో కారు పార్క్ చేసి ఉండడంతో అనుమానాస్పదంగా అనిపించిన భవనం సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆకారును పరిశీలించింది. ఆ కారులో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ తో పాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఉన్న ఓ లేఖను గుర్తించారు. ఆ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్, ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్‌లో ఉండే కారు నెంబర్ ప్లేట్ ఒకటేనని పోలీసులు గుర్తించారు. ఆ ఏరియా మొత్తం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటి అయిన ఈ ప్రాంతంలో, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్ ‌తో ఉన్న కారు ఉండడం పెద్ద సంచలనంగా మారింది.

ఇక,ఈ కేసు విచారణలో భాగంగా ఆ కారు గురించి పోలీసులు ఆరా తీయగా దాని యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌గా గుర్తించారు. గత ఏడాదిగా దానిని వాడటం లేదని, ఆ వాహనాన్ని అమ్మేందుకు ఫిబ్రవరి 16న డ్రైవ్‌ చేసినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. అయితే మధ్యలో వాహనం ఆగిపోవడంతో ములుండ్-ఐరోలి లింక్ రోడ్ వద్ద దానిని వదిలివేశానని, మరునాడు వచ్చి చూడగా దానిని ఎవరో దొంగిలించారని చెప్పారు. కారు చోరీ గురించి విఖ్రోలి పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు. అయితే శుక్రవారం ఆయన అనుమానాస్పదంగా మరణించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

అయితే,ఈ కేసులు కీలక వ్యక్తి అయిన మన్‌సుఖ్‌ హిరెన్‌ చనిపోవడంపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ కేసులో ప్రధాన లింక్ అయిన మన్‌సుఖ్‌ హిరెన్‌ పాయంలో ఉండి ఉండవచ్చునని,ఆయనకు భద్రత కల్పించాలని తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరానని,అయితే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసుని తేలికగా తీసుకుందన్నారు. ఇప్పుడు కేసులో కీలకమైన వ్యక్తి మృతదేహాం లభ్యమైందని..ఇది కేసుని అనుమానాస్పదమైనదిగా చేస్తుందన్నారు. దీని వెనుక ఏదైనా ఉగ్రకోణం దాగి ఉండవచ్చునని ఫడ్నవీస్ ఆరోపించారు. ఈ కేసుని వెంటనే ఎన్ఐఏకి అప్పగించాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు