Lily Flower : లిల్లీ పూల సాగులో యాజమాన్యపద్దతులు

అధిక సేంద్రియ పదార్ధం కల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల,ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి.

10TV Telugu News

Lily Flower : ఉద్యానవనాల్లో అందంగా ఈ లిల్లీ పుష్పాలు కనులకు కనువిందుచేస్తాయి. సంస్కృతి, సాహిత్యాలలో లిల్లీ పుష్పాలు ప్రపంచవ్యాప్తంగా విశిష్టస్థానాన్ని కలిగివున్నాయి. అయితే ఈ లిల్లీ పువ్వులలో కొన్ని జాతుల్ని వాటి దుంపల కోసం పెంచుతున్నారు. సంవత్సరం పొడవునా లిల్లీ పంట ఆదాయాన్ని అందించి లాభాలు కురిపిస్తుంది. పరిమళాలు వెదజల్లే ఈ లిల్లీలను అధికంగా అలంకరణలోను, బొకేలు, సుగంధ తైలాలు ఉత్పత్తిలోనూ వినియోగిస్తారు. దాంతో ఈ లిల్లీలకి వాణిజ్యపరంగా ప్రపంచ మార్కెట్లో సైతం అన్ని కాలాల్లో నిలకడైన ధర లభిస్తుండడం వల్ల చాలా మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మూడేళ్ల వరకు పూల ద్వారా రోజు వారి ఆదాయం లిల్లీ పంటను ఒకసారి నాటితే లభిస్తుంది. ఈ లిల్లీ పంట సాగుకు ఇతర ఉద్యాన పంటలలాగా ప్రైవేటు నర్పరీలపై ఆధారపడే అవసరం ఉండదు. లిల్లీ పంట సాగుకు అవసరమైన దుంపలను తోటి రైతుల నుంచి సేకరించుకునే సౌలభ్యం ఉంది. మూడేళ్ల వయసున్న తోటల నుంచి సేకరించిన దుంపలను లిల్లీ పంట సాగుకు, నాటేందుకు వినియోగించాలి.

సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగు రైతులకు లాభాల పంట పండిస్తోంది. పరిమళాలు వెదజల్లే లిల్లీ పూలను అలంకరణలోను,బొకేలు, సుగంధ తైలాలు ఉత్పత్తిలోనూ అధికంగా వినియోగిస్తారు. దాంతో లిల్లీ పూలు వాణిజ్యపరంగా ప్రపంచ మార్కెట్లో సైతం అన్ని కాలాల్లో నిలకడైన ధర లభిస్తుండడం వల్ల చాలా మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

సాధారణంగా లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూలలో సింగిల్, సెమిడబుల్, డబుల్ మరియు వెరిగేటెడ్ అనే రకాలు కలవు. వీటిలో ముఖ్యంగా వాణిజ్య సాగుకు అనువైన లిల్లీ రకాల్లో హైదరాబాద్ సింగిల్ ప్రజల్, కలకత్తా సింగిల్, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్ -సహాసిని వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వరుసల మధ్య 20నుంచి 30 సెం.మీ, మొక్కల మధ్య10నుంచి 20సెం.మీ ఉండే విధంగా దుంపలు నాటుకోవాలి.

లిల్లీ పూలు సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో చక్కగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. వీటికి వెలుతురు బాగా ఉండి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలు చక్కటి అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే పూల నాణ్యత బాగా తగ్గుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు మంచు పడే ప్రదేశాలు వీటి సాగుకు అసలు పనికిరావు.

అధిక సేంద్రియ పదార్ధం కల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల,ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక (పి.హెద్ )6.6-7.0 వరకూ ఉన్న నేలలో అధిక దిగుబడి పొందవచ్చు. ప్రధాన పొలంలో నీరు నిలువకుండా మురుగు నీటి వసతి కల్పించాలి లేకుంటే అనేక రకాల వ్యాధులు వ్యాపించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.

సేంద్రియ ఎరువుతోపాటు నజ్రని, భాస్వరం, పొటాష్‌లను ఎకరానికి 80కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా దుంపలు నాటిన తర్వాత 30,60,90, రోజులకు వేసుకోవాలి. అవసరం మేరకు 7నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. దిగుబడి ఎకరానికి 60వేల నుంచి 70వేల పుష్పపాలు, 3నుండి 4 టన్నుల విడిపూల దిగుబడి వస్తుంది.

లిల్లీ పూలను తామర పురుగులు, పేనుబంక, మొగ్గ తొలుచు పురుగు, నెమటోడులు ఆశించే అవకాశమున్నది. రసం పీల్చే పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ 2 మి.లీ లేదా క్వినాల్‌ఫాస్‌2.0మి.లీ కలిపి పిచికారి చేయాలి. మొగ్గ తొలుసు పురుగు నివారణకు క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ లేదా కార్బరిల్‌ 3గ్రా.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నెమటోడ్స్‌ నివారణకు ప్యురడాన్‌ గుళికలు ఎకరానికి 8నుంచి 10 కిలోలు భూమిలో తడి ఉన్నప్పుడు వేసి నివారించుకోవచ్చు.

వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, పూమొగ్గ కుళ్లుతెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు కార్బండైజిమ్‌ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి