Oxfam Report : ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో చనిపోతున్నారని పేద‌రిక నిర్మూల‌న‌కోసం ప‌నిచేసే "ఆక్స్‌ఫామ్‌" సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.

Oxfam Report : ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు

Oxfoam

Oxfam Report ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో చనిపోతున్నారని పేద‌రిక నిర్మూల‌న‌ కోసం ప‌నిచేసే “ఆక్స్‌ఫామ్‌” సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కరువు తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఆరు రెట్టు ఎక్కువ పెరిగిందని రిపోర్ట్ లో పేర్కొంది. ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు పర్యావరణ సంక్షోభం.. దీనికి తోడు అంతర్గత యుద్ధాలు.. వెరసి మనుషులను ఆకలి చావులకు గురిచేస్తున్నాయి

పెరుగుతున్న పేద‌రికం, ఆక‌లి చావుల‌పై ఆక్స్‌ఫామ్‌ సంస్థ గురువారం” ది హంగ‌ర్ వైర‌స్ మ‌ల్టిప్లైస్” పేరుతో ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. కరోనా కారణంగా నిమిషానికి ఏడుగురు చనిపోతున్నారని నివేదికలో ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. అయితే క‌రోనా మ‌ర‌ణాల కంటేఆక‌లి చావులే అధికంగా ఉన్న‌ాయని..ఆకలి కారణంగా ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని రిపోర్ట్ లో ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార భద్రత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఆక్స్‌ఫామ్‌ అమెరికా ప్రెసిడెంట్‌, సిఈఓ.. అబ్బీ మ్యాక్స్‌మ్యాన్‌ తెలిపారు. గతేడాది కంటే ఈ సంఖ్య రెండు కోట్లు పెరిగిందని, వీళ్లలో మూడింట రెండు వంతుల మంది తమ దేశాల్లో మిలిటరీ సంఘర్షణ కారణంగా ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి సమాజంలో ఏర్పడిన సంఘర్షణలు, వాతావరణ సంక్షోభం మరింత ముదరడం వల్ల ప్రపంచంలో సుమారు మరో 5,20,000 మంది ఆకలి చావులకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు. మరోవైపు, ఈ మహమ్మారి కాలంలోనూ దేశాలు మిలిటరీపై వెచ్చించిన మొత్తం 5,100 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఇప్పటికే ప్రకృతి విపత్తులు, కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు అక్కడి ప్రజలను ఆకలి చావులకు గురిచేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌, ఇథియోపియా, దక్షిణ సూడాన్‌, సిరియా, యెమెన్‌లాంటి దేశాల్లో ఆకలి చావులు అధికంగా ఉన్నాయి. ఆ దేశాలు ఆకలి చావులకు కేరాఫ్‌గా మారాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ఈ అంతర్గత యుద్ధాలను ఆపాలని..అప్పుడే ఆకలి చావులను అరికట్టగలమని మ్యాక్స్‌మ్యాన్‌ తెలిపారు. ఆకలిపై పోరాటానికి దేశాలు..ఐక్యరాజ్య సమితికి అవసరమైన నిధులను అందించాలని కోరారు.