INX మీడియా కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేయనున్న ఈడీ

  • Published By: sreehari ,Published On : October 15, 2019 / 12:09 PM IST
INX మీడియా కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేయనున్న ఈడీ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషాల పాటు 74ఏళ్ల చిదంబరాన్ని ఈడీ ప్రశ్నించనుంది. విచారణ అనంతరం అవసరమైతే ఆయన్ను అరెస్టు చేసేందుకు ఈడీకి కోర్టు నుంచి అనుమతి లభించింది. ఇప్పటికే సెప్టెంబర్ 5 నుంచి నెల రోజులగా తీహార్ జైల్లో ఉంటున్న చిదంబరం సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి మనీలాండరీంగ్ కు పాల్పడినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తూ రెండు పిటిషన్లను కోర్టులో సమర్పించింది. అధికారికంగా అరెస్ట్ చేయడమే కాకుండా తమ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

ఈ విషయంలో ప్రత్యేక కోర్టు రెండు ఆప్షన్లు ఇచ్చింది. అందులో ఒకటి.. కోర్టు ప్రాంగణంలోనే చిదంబరాన్ని అరగంట పాటు ప్రశ్నించడం.. ఆ తర్వాతే కస్టడీలో తీసుకోవడం.. ప్రస్తుతానికి చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించి.. అవసరమైతే అక్కడి నుంచే ఆయన్ను అరెస్ట్ చేయాలని రెండో ఆప్షన్ ఇచ్చింది. ఈడీ సాధ్యమైనంత వరకు ప్రాథమికంగా చిదంబరాన్ని అరెస్ట్ చేయాలని భావిస్తోంది.

ఈ విషయంలో దర్యాప్తు సంస్థ రెండో ఆప్షన్ ఎంచుకుంది. చిదంబరాన్ని ఉదయం వేళ అరెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపర్చాలని చూస్తోంది. అప్పుడే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేసు నమోదు చేసిన సీబీఐ చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 5 నుంచి ఆయన్ను జ్యూడిషీయల్ కస్టడీకి తరలించింది. మరోవైపు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ చిదంబరాన్ని ప్రశ్నించాలని భావిస్తోంది.

2007లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం.. తన కుమారుడు కార్తీ చిదంబరం ఆదేశాల మేరకు INX మీడియాలో విదేశీ నిధులను భారీ మొత్తంలో సంస్థలోకి విడుదల చేసేందుకు సంతకం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కార్తీక చిదంబరం కిక్ బ్యాక్ లు అందుకున్నారని సీబీఐ కూడా ఆరోపించింది. ఈ నిధులను విదేశాలలో నిల్వ చేసినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. కార్తీ చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ.. కోర్టు అనుమతి లేకుండా అతన్ని దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదని తెలిపింది.