ఇది నిజమే : భారత్ కు ఇమ్రాన్ ఖాన్..మోడీతో సమావేశం

  • Published By: venkaiahnaidu ,Published On : January 16, 2020 / 12:30 PM IST
ఇది నిజమే : భారత్ కు ఇమ్రాన్ ఖాన్..మోడీతో సమావేశం

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)సదస్సు జరగనుందని సోమవారం రష్యా,చైనా నేతృత్వంలోని SCO సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నొరొవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా ఇవాళ ఆ విషయన్ని దృవీకరించింది.

బుధవారం(జనవరి-15,2020)చైనా ద్వారా యునైటెడ్ నేషన్స్ సెక్యురిటీ కౌన్సిల్(UNSC)లో జమ్మూకశ్మీర్ విషయాన్ని లేవనెత్తాలని ప్రయత్నించి పాక్ విఫలమైన కొన్ని గంట్లోనే భారత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. కశ్మీర్ అంశంపై చర్చించే వేదిక ఇది కాదని UNSCలో చాలా మంది సభ్యులు చెప్పారు. UNSCలో జమ్మూ కాశ్మీర్‌పై చర్చించడానికి క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించడానికి ఇది చైనా చేసిన మూడవ ప్రయత్నం. మరోవైపు పాక్ చర్యలను భారత ప్రభుత్వం ఖండించింది. పాక్ ప్రయత్నాలను UNSC దుర్వినియోగం అని తెలిపింది.  

ప్రభుత్వం తెలిపిన ప్రకారం…SCO సదస్సుకు మొత్తం ఎనిమిది సభ్య దేశాలు, నాలుగు పరిశీలక దేశాలు ఆహ్వానించబడతాయి. అంతేకాకుండా ఇతర అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించనున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. 2001లో ఏర్పాటైన SCOలో భారత్,పాకిస్తాన్ లు 2017లో చేరిన విషయం తెలిసిందే.

గతేడాది జూన్ లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన SCO సమ్మిట్ కి భారత్ ప్రధాని మోడీ,పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సమ్మిట్ సందర్భంగా నేరుగా పాకిస్తాన్ ను టార్గెట్ చేసి మోడీ మాట్లాడారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ,సహాయం చేస్తూ,ప్రోత్సహిస్తున్న దేశాలు తప్పనిసరిగా జవాబుదారీతనంగా ఉండాలని పాక్ ను ఉద్దేశించి మోడీ ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయాలన్న SCO లక్ష్యాన్ని నొక్కిచెప్పిన మోడీ దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచ సమావేశానికి పిలుపునిచ్చారు.