కుంభమేళాలో పాక్ ఎంపీ : భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 09:02 AM IST
కుంభమేళాలో పాక్ ఎంపీ : భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం

ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప్రపంచ దేశాలకు యూపీలోని ప్రయోగ్‌రాజ్ కుంభమేళా ఆహ్వానం పలుకడంతో ఈసారి కుంభమేళాకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన అధికార పార్టీ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని ఈ కుంభమేళాలో పాల్గొనం ఆసక్తికరంగా మారింది. 

కుంభమేళా-2019లో పాల్గొనాలనే భారత్ ఆహ్వానం మేరకు విదేశీ ప్రతినిధుల బృందంతో తాను వచ్చినట్టు రమేష్ కుమార్ వాంక్వాని తెలిపారు. ఇండియాకు వచ్చిన తనకు భారత్ సాదర స్వాగతం పలకడం పట్ల వాంక్వాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వీకే సింగ్‌లను కలిసినట్టు రమేష్ కుమార్ తెలిపారు.
 

పుల్వామా దాడిలో పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని,  ఆశాభావ దృక్పథంతో కలిసి ముందుకు సాగుదామని.. శాంతినే తాము కోరుకుంటున్నామని కూడా వారికి తాను చెప్పినట్టు డాక్టర్ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో పాక్ ఎంపీ ఇండియా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.