జనవరి-2నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్…83కోట్ల సిరంజీలు సిద్ధం

జనవరి-2నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్…83కోట్ల సిరంజీలు సిద్ధం

Pan-India Covid vaccination dry run కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 2న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహించబడుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్-31,2020)ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది.

దేశవ్యాప్త డ్రై-రన్​ నిర్వహించే విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ నేతృత్వంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి-2,2021న కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను,కేంద్రపాలితప్రాంతాలకు సూచించింది కేంద్రఆరోగ్యశాఖ. ఈ కార్యక్రమం అంతా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయ‌నున్నారు.

కాగా, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఈనెల 28-29 తేదీలలో పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్​ విజయవంతమైనట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు, దాదాపు 83కోట్ల సిరంజీల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. అదనంగా,35కోట్ల సిరంజీలకు బిడ్స్ ను ఆహ్వానించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఈ సిరంజీలను వాడనున్నారు.