రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2020 / 02:59 PM IST
రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం

21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్లపై ఒక్క వలస కూలీ కూడా లేరని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకి తెలిపారు.  కరోనా వైరస్ నేపథ్యంలో 21రోజుల లాక్ డౌన్ విధించిన తర్వాత ఎటువంటి పని లేకపోవడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మంది వలస కూలీలకు రిలీఫ్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీం విచారించింది. రోడ్లపై ఉన్నవాళ్లని ఇప్పటికే దగ్గర్లోని అందుబాటులో ఉన్న షెలర్లకు తరలించబడ్డారని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం,ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వాలని,మరియు ఆహారం,మందులు వారికి అందించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వలస కార్మికులకు తమ ఉన్న భయాందోళనలు తొలగించడానికి కౌన్సిలింగ్ సౌకర్యం కూడా కలిపించాలని ఆదేశించింది. వలస కార్మికుల మనోధైర్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని కూడా కోర్టు నొక్కి చెప్పింది. మీరు భజన్, కీర్తన, నమాజ్ లేదా ఏదైనా కలిగి ఉండవచ్చు, కాని మీరు ప్రజలకు బలం ఇవ్వాలి అని కోర్టు తెలిపింది. శిక్షణ పొందిన కౌన్సిలర్లు మరియు అన్ని మతాలకు చెందిన కమ్యూనిటీ లీడర్లు రిలీఫ్ క్యాంపులను సందర్శించి భయాందోళనలను నివారించండని తెలిపింది.

శిక్షణ పొందిన కౌన్సిలర్లతో పాటు, మత పెద్దలను వలస వచ్చిన వారితో మాట్లాడటానికి తీసుకువస్తామని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. షెలర్లను నిర్వహించే బాధ్యత పోలీసులకు కాకుండా వాలంటీర్లకు ఇవ్వాలి మరియు వలస కార్మికులపై ఎలాంటి బలప్రయోగం లేదా బెదిరింపులు ఉండకూడదని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే… మెహతాతో మాట్లాడుతూ అన్నారు. భయాందోళన అనేది వైరస్ కంటే ఎక్కువ ప్రాణాలను నాశనం చేస్తుందని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వింటున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే…షెల్టర్ హోమ్స్ కు వచ్చిన వలస కార్మికులందరీకీ ఆహారం, పోషణ మరియు వైద్య సహాయం అందించేలా చూడాలని కేంద్రానికి చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వారు నగరాల్ని వీడారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నగరాల నుంచి గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఇలా ఊర్లకు వెళ్లడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువ అవతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న ఈ వైరస్ ఇండియాలో తక్కువ స్థాయిలో ఉందని, లాక్‌డౌన్ సక్రమంగా పాటిస్తే కరోనాను అడ్డుకోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Also Read | మురికినీటిలో Covid-19 వ్యాప్తి, సోకిన వ్యక్తి మలంలోనూ వైరస్ ఉంటుంది : డచ్ సైంటిస్టులు