ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌ సింగ్‌ బదిలీ

ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ పై బదిలీ వేటు పడింది. హోం గార్డ్ డిపార్ట్మెంట్ కు డీజీగా ఆయనను బదిలీ చేసింది ప్రభుత్వం.

ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌ సింగ్‌ బదిలీ

Hemant Nagrale

Hemant Nagrale రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద భద్రత వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ను బదిలీ చేసింది. హోం గార్డ్ విభాగానికి డీజీగా ఆయనను నియమించింది ప్రభుత్వం. కాగా, ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో..ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్,అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజేని NIA(జాతీయ దర్యాప్తు సంస్థ)అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఈ చర్య వెలుగుచూసింది. సచిన్ వాజే..నేరుగా పరమ్ బిర్ సింగ్ కు రిపోర్ట్ చేసేవారన్న విషయం తెలిసిందే.

పరమ్ స్థానంలో.. ముంబై కొత్త పోలీస్ కమిషనర్ గా హెమంత్ నాగరాలే నియమించబడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర డీజీపీగా ఉన్న హేమంత్ నాగరాలే..ముంబై పోలీస్ కమిషనర్ గా నియమించబడటంతో ఆయన స్థానంలో 1988 బ్చాచ్ ఐపీఎస్ ఆఫీసర్ రజ్నిష్ సేత్ మహారాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా రజ్నిష్ సేత్ విధులు నిర్వహిస్తున్నారు

ఇక, అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పీపీఈ కిట్​ ధరించి, సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వ్యక్తి.. సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం స్పష్టం చేసింది. కారులో పేలుడు పదార్థాలను.. వాజేనే పెట్టారని ప్రకటించింది. ఎవరో ఆదేశిస్తేనే పేలుడు పదార్థాలను వాజే పెట్టారని చెప్పింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం అసలు నంబరు ప్లేటు సచిన్‌ వాజే సొంత వాహ నంలో లభించినట్లు ఇప్పటికే ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.