పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700

పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700

Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరల పెరుగుదల కనిపించింది. గతంలో సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. జనవరి 29వ తేదీ నుంచి కొత్త మెనూ ప్రకారం…పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

శాఖాహార భోజనానికి వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉడకబెట్టిన కూరగాయల ధర రూ. 12గా ఉండేది. ఇప్పుడు రూ. 50కి పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్ లో హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ. 65కే లభించేది. ఇప్పుడు ఈ ధరను పెంచారు. రూ. 150కి లభ్యం కానుంది. చపాతీ ధర మాత్రం రూ. 3 గా ఉండగా..ఇప్పుడు నాన్ వెజ్ బఫే కావాలంటే…రూ. 700 చెల్లించాల్సిందే. మెనూలో అత్యధికంగా ధర ఉన్నది ఇదే. వెజ్ బఫే రూ. 500గా ఉంది. ఖర్చుల కట్టడికి ఈ చర్యతో ఏటా రూ. 8 కోట్లు ఆదా కానున్నట్లు అంచనా వేస్తోంది. ఈ క్యాంటిన్ ను ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఇండియన్ రైల్వేస్…ఆహారాన్ని అందిస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు, కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమయ్యింది. 1968 నుంచి పార్లమెంటు క్యాంటీన్ ద్వారా ఎంపీలకు ఆహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి పార్లమెంట్ సెషన్ లో సుమారు 5,000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్ మెనూలో భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం మొత్తం 48 ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) పార్లమెంటు సభ్యులకు భోజనం అందించనుంది.