CAA నిబంధనల రూపకల్పన గడువును పొడిగించిన పార్లమెంట్

పౌరసత్వ సవరణ చట్టం(CAA) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది.

CAA నిబంధనల రూపకల్పన గడువును పొడిగించిన పార్లమెంట్

Caa

CAA పౌరసత్వ సవరణ చట్టం(CAA) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది. 2020 జనవరి 10న అమల్లోకి వచ్చిన సీఏఏ నిబంధనలు రూపొందించేందుకు ఏప్రిల్‌ 9 వరకు లోక్‌సభ, జులై 9 వరకు రాజ్యసభ గడువు ఇచ్చినట్లు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

సాధారణంగా ఏదైన చట్టం అమల్లోకి వచ్చిన 6నెలల్లోపు నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది. కేంద్రం నియమ నిబంధనలు రూపొందించిన తర్వాత సీఏఏ పరిధిలోకి వచ్చే విదేశీయులు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన మైనార్టీలైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మోడీ సీఏఏ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాక్,బంగ్లాదేశ్,ఆప్గానిస్తాన్ దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొని, 2014 డిసెంబర్ 31నాటికి భారతదేశానికి వచ్చిన ఈ వర్గాల వారిని అక్రమ వలసదారులుగా పరిగణించరు,వీరికి భారత పౌరసత్వం ఇస్తారు.

కాగా,2019 డిసెంబర్ లో CAA బిల్లుని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తృత నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. పోలీసు కాల్పులు మరియు ఇతర హింసలలో దాదాపు 100 మంది మరణించారు. ఢిల్లీలో రెండు,మూడు నెలల పాటు పెద్ద ఎత్తున సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. సీఏఏ అనుకూల-సీఏఏ వ్యతిరేక వర్గాల మధ్య గతేడాది ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక, సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద మహిళల నేతృత్వంలోని నిరసనకు కూడా గత సంవత్సరం విస్తృత ప్రచారం లభించింది.

ఏదేమైనప్పటికీ, సీఏఏకు వ్యతిరేకంగా చేసిన నిరసనలను ” రాజకీయ”నిరసనలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ చట్టం కారణంగా ఏ భారతీయుడూ తన జాతీయతను కోల్పోరని ఆయన సృష్టం చేశారు.