OBC Bill : ఓబీసీ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది.

OBC Bill : ఓబీసీ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

Parliament

OBC Bill రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. ఓబీసీ బిల్లుకు కాంగ్రెస్ స‌హా విప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. 127వ రాజ్యాంగ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతూ..సుప్రీంకోర్టుచే తిర‌స్క‌రించ‌బ‌డిన రాష్ట్రాల హ‌క్కులు ఈ బిల్లు ద్వారా తిరిగి పున‌రుద్ధ‌రించ‌బ‌డ‌నున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితాను కలిగి ఉండేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుందని వీరేంద్ర కుమార్ తెలిపారు. ఓబీసీల గుర్తింపు, నిర్ధరణ ప్రక్రియకు అనుగుణంగా లేనందున సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్‌ను తొలగించింది. అందువల్ల రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సి వచ్చింది. మొత్తంగా 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని ఆయన చెప్పారు. దేశంలోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఈ బిల్లు చరిత్ర సృష్టించిందన్నారు. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా,మంగళవారం ఓబీసీ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. త్వరలోనే రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ఓబీసీ బిల్లుతో ప్రయోజనం ఏంటీ

1993 నుండి కేంద్రం, రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ఓబీసీల ప్రత్యేక జాబితాలను తయారు చేస్తున్నాయి. అయితే, 2018 రాజ్యాంగ సవరణ తర్వాత ఇది జరగలేదు. ఇప్పుడు ఈ బిల్లు ఉభయసభల ఆమోదం పొందిన నేపథ్యంలో పాత విధానం మళ్లీ అమలు చేస్తారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం ప్రకారం వివిధ కులాలను ఓబీసీ (OBC) కోటాలో చేర్చగలుగుతాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కుతుంది. ఇది హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లోని గుజ్జర్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కులాలు చాలా కాలంగా రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇందిరా సాహ్నీ కేసును ఉదహరిస్తూ సుప్రీం కోర్టు వారి డిమాండ్లపై స్టే విధించింది. ఇందిరా సాహ్నీ కేసు నిర్ణయం ప్రకారం, ఎవరైనా 50%పరిమితికి మించి రిజర్వేషన్ ఇస్తే, సుప్రీం కోర్టు దానిని నిషేధించవచ్చు. ఈ కారణంగా అనేక రాష్ట్రాలు ఈ పరిమితిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ రాజ్యసభలో ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో కొంతమంది విపక్ష సభ్యులు..గరిష్ట ప్రయోజనాలను పొందడానికి రిజర్వేషన్ మరియు కుల గణనపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు.