సహకరించండి : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

  • Published By: madhu ,Published On : November 17, 2019 / 09:05 AM IST
సహకరించండి : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, నవంబర్, 18వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు స్పీకర్‌ ఓం బిర్లా. నవంబర్, 17వ తేదీ ఆదివారం పార్లమెంట్‌ హాలులో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. అయితే బిజినెస్‌ అడ్వయిజరి కమిటీలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఓంబిర్లా. 

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రంజన్ చౌదరి, టీఎంసీ నేత సుధీప్ బందోపాధ్యాయ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, బీఎస్‌పీ నేత దినేష్ అలి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18 నుంచి డిసెంబర్ 13 వరకూ జరుగనున్నాయి. ఆర్థికమాంద్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, కశ్మీర్‌ పరిస్థితిపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెల్లడించారు. ఎన్డీయే నుంచి శివసేన వైదొలగడంతో పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆ పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు మారాయి. ప్రతిపక్ష పార్టీల దగ్గరకు శివసేన సభ్యుల స్థానాలను మార్చారు. 
Read More : గవర్నర్ భేటీ వాయిదా : ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు వద్దు – శివసేన